హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదైతే, ఆ క్రెడిట్ కూడా తనదేనని చెప్పుకోవడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. ‘దొంగే దొంగ’ అని అరిచినట్లు రేవంత్ వైఖరి ఉందని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై కేవలం తమ కార్యకర్తల చొరవతో, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను సీఎం తన ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కేసులతో ఏం సంబంధమని ప్రశ్నించారు.
ఒకవైపు కేసులు పెట్టిన ఘనత తనదేనని చెప్పుకుంటూనే, మరోవైపు ఆ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబును బదిలీ చేయడం రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే మీరు కేసుల నమోదును సమర్థిస్తే.. తన డ్యూటీ తాను సక్రమంగా చేసిన అధికారిని మరుసటి రోజే బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. సక్రమంగా డ్యూటీ చేసిన అధికారులను శిక్షిస్తూ, ఆ ఘనతను మాత్రం తమ ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్ ‘బనానా రిపబ్లిక్’ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
