క్యా బోల్తీ పబ్లిక్ .. సెసెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా సీజేపీ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

క్యా బోల్తీ పబ్లిక్ .. సెసెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా సీజేపీ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కొత్త క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించిన అభిజీత్ దీప్కే 
  • సెప్టెంబర్ ​ఒకటి నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తం 
  • నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, 
  • సామాజిక న్యాయమే ఎజెండా అని వెల్లడి 

ఛత్రపతి శంభాజీనగర్:  సెప్టెంబర్​ఒకటి నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయమే ఎజెండాగా.. పౌరులతో మమేకమవ్వడానికి ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరిట దేశవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్త ప్రజా ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. మహారాష్ట్రలోని దీప్కే స్వస్థలమైన ఛత్రపతి శంభాజీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు రోజుల సీజేపీ కోర్ టీమ్ సమావేశం గురువారం ముగిసింది. అనంతరం దీప్కే మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య సంస్థలలో జవాబుదారీతనాన్ని పునరుద్ధరించడానికి దేశానికి ప్రస్తుతం ఒక ప్రజా ఉద్యమం అవసరమని ఆయన పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో సీజేపీ రాజకీయ పార్టీగా మారకుండా ప్రెషర్​గ్రూపుగానే కొనసాగుతుందని చెప్పారు. దేశంలోని ప్రజలు, ముఖ్యంగా యువత ఆకాంక్షలు, అంచనాలు, ఆందోళనలను తెలుసుకోవడానికి సెప్టెంబర్‌‌‌‌లో దేశవ్యాప్తంగా పర్యటించడానికి తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. ‘దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏండ్లలోపు వారే. అయినా, ఈ ప్రభుత్వం వారి ఆందోళనలను పట్టించుకోలేదు. ఈ సమస్యల గురించి మాట్లాడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. మేము ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వింటాము’ అని ఆయన అన్నారు.  విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విద్యా సంస్కరణల కోసం సీజేపీ కృషి చేస్తుందని దీప్కే పేర్కొన్నారు. విద్యార్థులు అధిక ట్యూషన్ ఫీజులు చెల్లించడం, కుటుంబాలు భారీ విద్యా ఖర్చులు భరించాల్సి రావడంతో విద్యా వ్యయం గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. నాణ్యమైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల యువత నిరాశలో ఉందని,  నిరుద్యోగాన్ని ఒక కీలక జాతీయ సమస్యగా మార్చాలని  ఆయన కోరారు. మన దేశంలో ఉద్యోగాలు దాదాపుగా లేవని, జంతర్ మంతర్‌‌కు తరలొచ్చిన వారిలో చాలా మంది నిరుద్యోగులే ఉన్నారని ఆయన చెప్పారు. స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లేదా డెలివరీ బాయ్ అవ్వాలనేది ఎవరి కల, ఆకాంక్ష కాదని అన్నారు. డిగ్రీ సంపాదించిన తర్వాత కూడా దేశంలోని యువతలో దాదాపు 80 శాతం మంది నిరుద్యోగులుగానే ఉన్నారని.. కానీ, ఎలాంటి డిగ్రీ లేని వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నాని.. విద్యావంతులైన యువత భవిష్యత్తును వారు నిర్ణయిస్తున్నారని దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు.  

సీజేపీ కార్యవర్గ కమిటీ ఏర్పాటు

సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీని ప్రకటించింది. గురువారం దీప్కే ఇంట్లో కోర్ టీమ్ రెండు రోజుల సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించింది. జాతీయ కమిటీ కన్వీనర్‌‌‌‌గా దీప్కే (30), కోకన్వీనర్లుగా సౌరవ్ దాస్ (27), అశుతోష్ రంకా (30) ఎన్నికయ్యారు. అజింక్య షిండే (35)ను జాతీయ ఆర్గనైజేషన్ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌గా,  దీపక్ బలియాన్ (26)ను కోఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌గా నియమించారు. ఆఫ్రీన్ నవాజ్ (34) జాతీయ కార్యదర్శిగా, విజయ్ రెడ్డి మల్లంగి (30) మీడియా హెడ్‌‌‌‌గా, రత్న సింగ్ (31) లీగల్ హెడ్‌‌‌‌గా, వైష్ణవి గౌర్ (29) రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం హెడ్‌‌‌‌గా, రోహన్ దేశ్‌‌‌‌పాండే (31) టెక్నికల్ హెడ్‌‌‌‌గా, యోగేష్ ఇంగ్లే (33) ఫైనాన్స్ హెడ్‌‌‌‌గా పని చేయనున్నారు.