అసన్ (కొరియా): ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ.. కొరియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ తన్వీ 21–16, 17–21, 21–13తో శ్రీయాన్షి వాలిశెట్టి (ఇండియా)పై చెమటోడ్చి నెగ్గింది. 57 నిమిషాల మ్యాచ్‌లో తన్వీ తొలి గేమ్ ఈజీగా నెగ్గినా.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి ధాటిని అడ్డుకోలేకపోయింది. వరుస స్మాష్‌లతో హోరెత్తించిన శ్రీయాన్షి గేమ్‌ను కైవసం చేసుకుంది. అయితే డిసైడర్‌లో బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో తన్వీ గేమ్‌ను ఏకపక్షంగా మార్చేసి విజయం సాధించింది.
ఇతర మ్యాచ్‌ల్లో రక్షిత శ్రీ 22–20, 21–10తో మనామి సుయుజ్ (జపాన్)పై, అష్మితా చాలియా 21–17, 21–6తో కిమ్ మిన్ జి (కొరియా)పై నెగ్గగా, ఇషారాణి 21–17, 18–21, 19–21తో కిమ్ మిన్ సున్ (కొరియా) చేతిలో, అన్మోల్ ఖర్బ్ 21–23, 21–15, 18–21తో వుయ్ ట్రాయ్ ట్రాంగ్ (చైనా) చేతిలో, మాన్సి సింగ్ 12–21, 21–14, 17–21తో హన్ జియాన్ జి (చైనా) చేతిలో ఓడారు. మెన్స్ డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్–పృథ్వీ 21–18, 21–19తో కిమ్ యంగ్ హుక్–షిన్ టా యంగ్ (కొరియా)పై గెలవగా, విమెన్స్ డబుల్స్‌లో సోనాలీ సింగ్–రితికా థాకర్ 15–21, 9–21తో సుమైర్ నకడే–మియు తకహషి (జపాన్) చేతిలో కంగుతిన్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–శ్రుతి మిశ్రా 16–21, 21–16, 13–21తో షిన్ టి యాంగ్–కిమ్ యు జంగ్ (కొరియా) చేతిలో చుక్కెదురైంది.
