విజయవాడ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో వాలీబాల్ క్రీడాభివృద్ధికి దీర్ఘకాలిక కార్యాచరణను హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి తొలి అడుగుగా విజయవాడలోని పీవీఎల్ ఓపెన్ ట్రయల్స్ అండర్–21 ప్లేయర్ల ఎంపికను బ్లాక్ హాక్స్ మొదలుపెట్టింది. ఈ మేరకు వీఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీలోని ప్రతి జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి 6 నుంచి 8 తరగతి వరకు విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే వాలీబాల్‌ను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని బ్లాక్ హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి కంకనాల వెల్లడించాడు.
దీర్ఘకాలిక కార్యాచరణలో భాగంగా ప్రతి ఏడాది టాలెంట్ హంట్‌ను నిర్వహించడం, జిల్లా, గ్రామీణ స్థాయి టోర్నమెంట్‌లకు మద్దతు ఇవ్వడం, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కోచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ప్రొఫెషనల్ స్థాయి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపాడు. ఒక్క సంస్థతోనే బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించడం సాధ్యం కాదన్న అభిషేక్.. ప్రభుత్వం, క్రీడా సంఘాలు అందరం కలిసి పని చేస్తే తెలుగు రాష్ట్రాలను దేశంలోనే అత్యంత బలమైన వాలీబాల్ కేంద్రంగా తీర్చిదిద్దగలమన్నాడు.
