- ప్రజాస్వామ్యంలో నిరసన సరైన పద్ధతిలో జరగాలి: మోహన్ భగవత్
- జెన్ జీల పట్ల నమ్మకం ఉంది.. రిజర్వేషన్లు కొనసాగాలి
- ఐఐఎంయూఎన్ వార్షికోత్సవంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పీచ్
ప్రశ్నిస్తున్నందుకు యువతను తప్పుపట్టడం కంటే చర్చల ద్వారా వారి మనోగతం వినాలి. వాళ్లు మన సొంత మనుషులే. ప్రజాస్వామ్యంలో నిరసనలు ఒక భాగం. నేటి యువత గత తరాల కంటే చాలా నిజాయితీగా ఉంది. ప్రతి విషయాన్ని గుడ్డిగా అంగీకరించకుండా.. లాజికల్‌గా ప్రశ్నిస్తోంది. విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు యువత గళం విప్పడం సహజం. విద్య అనేది వ్యాపారం కావొద్దు. - మోహన్ భగవత్
ముంబై: మన దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందని..జెన్ జీ తరాన్ని తాను గుడ్డిగా నమ్ముతానని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యువత చేసే నిరసనలను దేశద్రోహంగా చూడకూడదని.. వారు మన సొంత మనుషులేనని చెప్పారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. గురువారం మహారాష్ట్ర ముంబైలో 'ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (ఐఐఎంయూఎన్) 15వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన మోహన్ భగవత్..దాదాపు 2,000 మంది జెన్ జీ, జెన్ ఆల్ఫా యువతను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రశ్నిస్తున్నందుకు యువతను తప్పుపట్టడం కంటే చర్చల ద్వారా వారి గొంతును వినాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక భాగమని.. అయితే అది సరైన పద్ధతిలో జరగాలని అభిప్రాయపడ్డారు. నేటి యువత గత తరాల కంటే చాలా నిజాయితీగా ఉన్నారని భగవత్ కొనియాడారు. పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా అంగీకరించకుండా..ప్రతి విషయాన్ని తార్కికంగా ప్రశ్నిస్తోందని తెలిపారు.
విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు యువత గళం విప్పడం సహజమని, వారి ఆందోళనలను మెరుగుదల కోసం చేసిన ప్రయత్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. విద్య అనేది వ్యాపారం కాకూడదని, సమాజంలోని అందరూ కలిసి విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేయాలని కోరారు. సోషల్ మీడియా ప్రభావం, జాతీయ భద్రత, సామాజిక అంశాలపై కూడా భగవత్ మాట్లాడారు.
కేవలం చట్టాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ఆపలేమని, సమాజంలో మంచి ఆదర్శాలను పాటించాలని చెప్పారు. అంతర్జాతీయ ఘర్షణల సమయంలో ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, అదే సమయంలో మానవత్వాన్ని మరువకూడదని తెలిపారు. ఎల్‌జీబీటీక్యూ వర్గం కూడా మన సమాజంలో ఒక భాగమేనని.. వారి సహవాసానికి తగిన గుర్తింపు ఇచ్చేలా సమాజం ఒక మార్గాన్ని వెతుక్కోవాలని మోహన్ భగవత్ పేర్కొన్నారు.
సామాజిక సమానత్వాన్ని సాధించేందుకే క్యాస్ట్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని.. అసమానతలు ఉన్నంతవరకు అవి కొనసాగుతాయని భగవత్ తెలిపారు. అయితే, రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే లబ్ది పొందినవారు ఆ ప్రయోజనాలను వదులుకునేంత ఉదారతను ప్రదర్శించాలని కోరారు.
