- తనకు ఇంట్లో గౌరవం ఇవ్వడం లేదని లేఖ
- మధ్యప్రదేశ్ చుట్టాల ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
జగిత్యాల రూరల్, వెలుగు: 'అమ్మానాన్నా.. ఇంట్లో నాకు చాలా విలువ ఉండేది.. నన్ను మందలించే వాళ్లే ఎక్కువయ్యారు..' అంటూ లేఖ రాసి ఓ విద్యార్థిని స్కూల్ నుంచి అదృశ్యమైంది. చివరకు మధ్యప్రదేశ్‌లోని బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రంభీర్ సుమాన్ దంపతులు 20 ఏండ్ల క్రితం జగిత్యాలకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వీరి కుమార్తె షేక్ అస్త జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది.
బుధవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. స్కూల్‌లోనే దుస్తులు మార్చుకుని, బుక్స్, బ్యాగ్, బూట్లు అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి ప్రిన్సిపల్ నగేశ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా, బాలిక స్కూల్ ఆవరణలోనే దుస్తులు మార్చుకుని బయటకు వెళ్లినట్లు తేలింది.
ఆమె బ్యాగులో తల్లిదండ్రులకు ఉద్దేశించి రాసిన లేఖ లభించింది. అందులో.. ‘ప్రియమైన అమ్మానాన్నా.. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా.. ఇంట్లో నాకు చాలా విలువ ఉండేది.. నన్ను మందలించే వాళ్లే ఎక్కువయ్యారు..’ అని రాసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా గాలింపు నిర్వహించగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న బంధువుల ఇంట్లో బాలిక క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు.
