హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ గడువును ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు నెలలు పొడిగిస్తూ గురువారం చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31 వరకు హిల్ట్‌పాలసీ దరఖాస్తులకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జూన్ 5 కన్నా ముందున్న ఎస్సార్వో రేట్లే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇచ్చిన పాలసీ షరతులు, ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌లో ఎలాంటి మార్పులుండవని తేల్చి చెప్పారు. జూన్ 21న నిర్వహించిన రెవెన్యూ మొబిలైజేషన్ కేబినెట్ సబ్‌కమిటీ మీటింగ్‌లో పలువురు ఇండస్ట్రియలిస్టులు గడువు పెంచాలని కోరారు. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు కేవలం నెల రోజులే పాలసీ సైట్‌ను ఓపెన్ చేసి పెట్టారని, గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని కోరారు. ఈ మేరకు అక్టోబర్ వరకు గడువు పొడిగించారు.
