హనుమకొండ సిటీ, వెలుగు: ప్రమాదంలో మృతిచెందిన టీజీఎన్పీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ.1.05 కోట్ల ప్రమాద బీమా పరిహారాన్ని గురువారం అందజేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మృతుడి భార్య ఊకంటి సంధ్యకు చెక్కులు అందించారు.
ఎన్పీడీసీఎల్ ఉద్యోగి ఊకంటి ప్రకాశ్ యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగి ఉండటంతో పాటు ఏటీఎం కార్డును వినియోగిస్తున్నాడు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో శాలరీ అకౌంట్‌కు అనుబంధంగా ఉన్న ప్రమాద బీమా కింద రూ.1 కోటి, ఏటీఎం కార్డు బీమా కింద మరో రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.1.05 కోట్ల పరిహారాన్ని నామినీ అయిన ఆయన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ.. ఖాతాదారుల సంక్షేమానికి యూనియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.
శాలరీ అకౌంట్లకు అందుబాటులో ఉన్న బీమా సౌకర్యాలు, ఏటీఎం కార్డు బీమా నిబంధనలపై ఖాతాదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ రీజినల్ ఆఫీస్ డీజీఎం గంటి కమలాకర్, నక్కలగుట్ట బ్రాంచ్ చీఫ్ మేనేజర్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
