- ఈసీకి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 25న జారీ చేసిన జీవో 172 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన కుటుంబ నమోదు ధ్రువీకరణ పత్రాన్ని ఓటరు నమోదుకు అర్హతగా పరిగణించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త అమర్‌సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జీవో 172 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన కుటుంబ నమోదు ధ్రువీకరణ పత్రాన్ని ఓటరు నమోదుకు అర్హతగా పరిగణిస్తున్నారని తెలిపారు. దీనిని ధ్రువీకరణ పత్రంగా స్వీకరించడం చట్టవిరుద్ధమన్నారు. ఇది కేవలం రేషన్ కార్డుల కోసం జారీ చేస్తున్నదేనని చెప్పారు. వాదనలను విన్న బెంచ్ ఈసీ వివరణ కోసం విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
