- కేంద్ర మంత్రి అథవాలేకు ఎంపీ మల్లు రవి వినతి
న్యూఢిల్లీ, వెలుగు: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ వెల్ఫేర్ స్కీంలను సమర్థంగా అమలు చేయాలని ఎంపీ మల్లు రవి కేంద్రాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి కేంద్ర స్కీంల అమలును వేగవంతం చేయాలని కోరారు.
ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేను ఆయన అధికారిక నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తన నియోజకవర్గంలోని వెనుకబడిన గ్రామాల్లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ అమలు చేస్తున్న వివిధ వెల్ఫేర్ స్కీంలను సమర్థంగా అమలు చేయాలని మంత్రిని కోరినట్లు మల్లు రవి తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి అథావాలే సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
తెలంగాణకు మరిన్ని నవోదయ స్కూళ్లు ఇవ్వండి
తెలంగాణలోని కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ స్కూళ్లు (జేఎన్‌వీ) మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలోనూ ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన వసతి విద్య అందించడమే నవోదయ పథకం లక్ష్యమని గుర్తు చేశారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట తో పాటు 16 జిల్లాలకు కొత్తగా జేఎన్ వీ లను మంజూరు చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని సభ్యులకు వివరించారు.
