దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం' వారణాసి'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈమూవీపై అంతర్జాతీయంగా అంచనాలు రెట్టింపు స్థాయిలో నెలకొన్నాయి. గ్లోబ్ ట్రాటింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
జార్జియా షెడ్యూల్ పూర్తి..
గత కొద్ది రోజులుగా జార్జియాలోని అందమైన, గడ్డకట్టే మంచు ప్రాంతాల్లో 'వారణాసి' షూటింగ్ శరవేగంగా జరిగింది. అక్కడ ఒక కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని మహేష్ బాబు ఈరోజు ఉదయం ( మార్చి 9, 2026 ) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబు తన కొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్రౌన్ కలర్ బాంబర్ జాకెట్, బ్లాక్ షర్ట్, వైట్ క్యాప్ ధరించి మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం పెంచుతున్న పొడవాటి జుట్టు, గడ్డం కనిపించకుండా ఆయన క్యాప్ ధరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తదుపరి టార్గెట్.. అంటార్కిటికా!
హైదరాబాద్‌లో కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత, చిత్ర బృందం తమ తదుపరి అంటార్కిటికాకు బయలుదేరనుంది. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఏ చిత్ర బృందం వెళ్ళని ప్రాంతాల్లో రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేశారు.. దాదాపు రూ. 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో మహేష్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్, మాధవన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టీమ్ ఇండియా విజయంపై ప్రశంసలు
షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ మహేష్ బాబు క్రికెట్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, బుమ్రాల ప్రదర్శనను కొనియాడుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "భారత జట్టు ఆధిపత్యానికి ఇది నిదర్శనం.. 140 కోట్ల భారతీయుల గుండెల్లో గర్వాన్ని నింపారు" అంటూ అభినందించారు.
►ALSO READ | Gayapadda Simham: తరుణ్ భాస్కర్ మూవీకి డిమాండ్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్!
రిలీజ్ ఎప్పుడంటే?
విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇందులో టైమ్-ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కె.ఎల్. నారాయణ , ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
