Chiranjeevi : స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ రుషికి మెగాస్టార్ సర్ప్రైజ్ గిఫ్ట్.. 'నేనున్నాను' అంటూ చిరంజీవి పెద్ద మనసు!

Chiranjeevi : స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ రుషికి మెగాస్టార్ సర్ప్రైజ్ గిఫ్ట్.. 'నేనున్నాను' అంటూ చిరంజీవి పెద్ద మనసు!

మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తానే రియల్ హీరో అని మరోసారి నిరూపించుకున్నారు. టాలెంట్ ఎక్కడున్నా అభినందించడంలో చిరు ముందుంటారు. ఈసారి TG EAPCET 2026 ఫలితాల్లో చరిత్ర సృష్టించిన ఒక సాధారణ విద్యార్థినిని పిలిచి మరీ సత్కరించారు. హైదరాబాద్‌లోని రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఎం. రుషి తెలంగాణ ఈఏపీసెట్ ( TG EAPCET 2026) ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

కల నిజమైంది.. చిరు సర్ప్రైజ్!

రుషికి మెగాస్టార్ చిరంజీవిని కలవడం చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కల. ఈఏపీసెట్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో.. నువ్వు గనుక స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే.. నీ ఫేవరెట్ హీరో  చిరంజీవిని కలపిస్తాం అని ఆమె తల్లిదండ్రులు ప్రామిస్ చేశారు. అన్నట్టుగానే రుషి రికార్డు కొట్టింది. మెగాస్టార్ ఆమె కలను నిజం చేస్తూ.. బుధవారం ఉదయం రుషి ఫ్యామిలీని చిరు తన నివాసానికి ఆహ్వానించారు. లోపలికి రాగానే ఆప్యాయంగా పలకరించి, శాలువాతో సత్కరించారు. అంతేకాదు, ఆమె ఉన్నత చదువుల కోసం ఒక లాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా అందించి సర్ప్రైజ్ చేశారు.

మీ వెంట నేనున్నా..

ఈ సందర్భంగా రుషి భవిష్యత్తులో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత దేశానికి సేవ చేయడానికి ఐఏఎస్ (IAS) ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నట్లు చిరుకు చెప్పింది. దాంతో ముగ్ధులైన మెగాస్టార్ ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. మీకు ఎలాంటి అవసరం వచ్చినా అడగడానికి అస్సలు వెనకాడకండి. నన్ను మీ ఇంట్లో ఒక అన్నలా, కుటుంబ పెద్దలా భావించండి. ఈ అమ్మాయి తన ఐఏఎస్ కలను నిజం చేసుకునేలా ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండండి. నేను మీ వెంటే ఉంటాను అని చిరు హామీ ఇచ్చారు..

►ALSO READ | శవాన్ని ఎక్కడ దాచాడు? మోహన్‌లాల్ 'దృశ్యం 3' మైండ్ బ్లోయింగ్ బుకింగ్స్!

ఈ అద్భుత విజయంపై రెజోనెన్స్ విద్యాసంస్థల ఎండీ మిస్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ, రుషి సాధించిన ఈ చారిత్రాత్మక మైలురాయి ఎంతోమంది విద్యార్థినులకు ఇన్‌స్పిరేషన్ అని, ఆమెను మెగాస్టార్ అభినందించడం తమ కాలేజీకే గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ చేసిన ఈ సాయం, రుషి సాధించిన రికార్డుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.