మూసీ గేట్లు ఓపెన్

మూసీ గేట్లు ఓపెన్

యాదాద్రి, సూర్యాపేట, మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: నాలుగు రోజులగా వాన తెరిపిస్తలేదు. కొన్నిచోట్ల ఓ మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శుక్రవారం నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 5,205 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 642.15 అడుగుల మేర నీరు ఉంది. ఎగువ నుంచి ఇన్​ఫ్లో 4,861 క్యూసెక్కులుగా నమోదవుతోంది.  మూసీ నది యాదాద్రి జిల్లా సంగెం- బొల్లేపల్లి వద్ద లోలెవల్​ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. 

రుద్దవెళ్లి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆలేరు పెద్దవాగులోకి వరద నీరు చేరుతుండడంతో కొలనుపాక లోలెవల్​ బ్రిడ్జిని తాకుతూ ప్రవాహం కొనసాగుతోంది.  మోత్కూరులోని బిక్కేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.  అలాగే   చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. శుక్రవారం ఉదయం 600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరగా,లీకేజీల ద్వారా 200 క్యూసెక్కుల నుండి దిగువకు వెళ్తున్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు వెల్లడించారు‌‌. 45.77 టీఎంసీల సామర్ధ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 16.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.