మంచి కథ : శిష్యుడి ముందు చూపు, ప్రేమను చూసి చలించిపోయిన గురువు..

మంచి కథ : శిష్యుడి ముందు చూపు, ప్రేమను చూసి చలించిపోయిన గురువు..

పూర్వకాలంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గరకు చదువుకోవడానికి చాలామంది విద్యార్థులు వచ్చేవారు. వాళ్లకు విద్యనే కాకుండా సంస్కారాన్ని కూడా నేర్పేవాడు గురువు. ఆయన శిష్యరికంలో ఎంతోమంది ప్రయోజకులయ్యారు. 

పవన్ అనే యువకుడు కూడా ఆయన దగ్గర విద్యనభ్యసించడానికి ఆశ్రమంలో చేరాడు. ఈ యువకుడు గురువుతో ఎంతో అనుకువగా ఉండేవాడు. గురు శిష్యుల మధ్య సాన్నిహిత్యం చాలా పెరిగింది. ఒకరోజు గురు శిష్యులిద్దరు కలిసి పని మీద వేరే గ్రామానికి బయలుదేరారు. 

గురువును అగౌరవపరచకూడదన్న ఉద్దేశంతో పవన్ ఆయనకు ఒక అడుగు వెనకే నడుస్తూ ఆయన మాటలు వింటున్నాడు. అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక వాగు వచ్చింది. దాంతో గురువు శిష్యుడికి జాగ్రత్తలు చెప్తూ వాగులోకి దిగాడు. పవన్ వెంటనే గురువును ఒడ్డుకు లాగి, "గురువర్యా! ముందుగా నేను వాగు దాటుతా." అని పోరు పెట్టాడు. గురువు కాస్త వెనక్కి తగ్గాడు. 

పవన్ సంతోషంగానే వాగు దాటాడు. ఆ తర్వాత గురువు కూడా ఆ వాగు దాటేశాడు. కొద్దిసేపటికి ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని సేదతీరారు. "నీకు తల బిరుసుతనం ఎక్కువ. నా మాటకు విలువ ఇవ్వకుండా నాకంటే ముందు నువ్వే వాగు దాటి నీ మాటే నెగ్గించుకున్నావు" అంటూ పవన్​ ను నిందించాడు గురువు. "నేను కేవలం నా బాధ్యత నెరవేర్చా” అన్నాడు పవన్. 

►ALSO READ | Vastu Tips : అపార్ట్ మెంట్ లో రెండో బాత్రూం ఎక్కడ ఉండాలి.. డైనింగ్ హాల్ ఎటువైపు ఉండాలి..?

“అదెలా?” ఆశ్చర్యపోతూ అడిగాడు గురువు. "అసలే ఇది వానాకాలం. వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒకవేళ వాగును మీరు ముందే దాటితే, జరగరానిది ఏదైనా జరిగితే వేలమంది శిష్యులకు అన్యాయం చేసినవాడిని అవుతా. నాలాంటి వేలమంది శిష్యులు కలిసినా మీలాంటి ఒక గురువు తయారవ్వడం కష్టం. అదే మీరు క్షేమంగా ఉంటే నాలాంటి వాళ్లను ఎంతోమందిని తయారుచేయగలరు" అన్నాడు శిష్యుడు. ఆ మాట విని శిష్యుడి ముందుచూపును అర్థం చేసుకున్న గురువు అతడిని మనసారా దీవించాడు.