54ఏళ్ల తర్వాత.. జాబిల్లిపైకి మనుషులను పంపుతున్న నాసా.. ఆర్టెమిస్ 2 రాకెట్‌ కౌంట్ డౌన్ స్టార్ట్

54ఏళ్ల తర్వాత.. జాబిల్లిపైకి మనుషులను పంపుతున్న  నాసా.. ఆర్టెమిస్ 2 రాకెట్‌ కౌంట్ డౌన్ స్టార్ట్

 54ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి మరోసారి మనుషులను పంపుతోంది నాసా.. అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవ సహిత  రాకెట్ ఆర్టెమిస్ 2  ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది.  భారత కాలమానం ప్రకారం ..ఏప్రిల్ 2, 2026 న తెల్లవారు జామున 3:54 గంటలకు  స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ ద్వారా  ఓరియన్  వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.అమెరికాలోని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్  లాంచ్ ప్యాడ్ 39B నుంచి ఆర్టెమిస్ 2 ను ప్రయోగించనున్నారు. 

2022లో మానవరహిత ఆర్టెమిస్ 1 ప్రయోగం సక్సెస్ అయినత తర్వాత ఆర్టెమిస్ 2 ను రూపొందించారు. ఈ ప్రయోగం ద్వారా సుదూర అంతరిక్ష మిషన్లకు అవసరమైన అనేక సామర్థ్యాలను ప్రదర్శించనున్నారు. ఎస్‌ఎల్‌ఎస్ (Space Launch System - SLS) రాకెట్ , ఓరియన్ (Orion) వ్యోమనౌక ద్వారా నాసా వ్యోమగాములతో చేపడుతున్న మొట్టమొదటి ప్రయోగాత్మక యాత్ర ఈ ఆర్టెమిస్ 2. 

ఆర్టెమిస్ 2 వివరాలు.. 
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' (NASA) చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవ సహిత చంద్రమండల యాత్రే ఈ 'ఆర్టెమిస్ 2'. 1972లో జరిగిన అపోలో 17 ప్రయోగం తర్వాత, దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మనుషులతో  చంద్రుడి వద్దకు పంపుతున్న తొలి మిషన్ ఇదే కావడం విశేషం.

వ్యోమగాములు.. 
ఈ చారిత్రాత్మక యాత్రలో నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. నాసాకు చెందిన రీడ్ వైజ్‌మాన్ ఈ మిషన్‌కు కమాండర్‌గా, విక్టర్ గ్లోవర్  పైలట్‌గా(  చంద్రుడి వద్దకు వెళ్తున్న తొలి నల్లజాతీయుడిగా చరిత్ర),  
మిషన్ స్పెషలిస్ట్ గా  తొలి మహిళ క్రిస్టినా కోచ్ ఈ మిషన్ లో వ్యోమగాములుగా పాల్గొంటున్నారు.  వీరితోపాటు  కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA)కి చెందిన జెరెమీ హాన్సెన్  మిషన్ స్పెషలిస్ట్ గా పాల్గొంటారు. 

మిషన్ ఉద్దేశం..
ఈ మిషన్‌లో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై కాలుమోపకుండా  కేవలం చంద్రుడికి సమీపంలోకి వెళ్లి, దాని చుట్టూ తిరిగి (Lunar flyby) భూమికి చేరుకుంటారు. ఈ మొత్తం ప్రయాణం సుమారు 10 రోజుల పాటు సాగుతుంది. ప్రయోగం అంతా సజావుగా సాగితే ఏప్రిల్ 10వ తేదీన పసిఫిక్ మహాసముద్రంలో వీరు సురక్షితంగా ల్యాండ్ అవుతారు.

ఎందుకు ఈ ప్రయోగం?..
భవిష్యత్తులో ఆర్టెమిస్ 3 (Artemis III) ద్వారా మనుషులను నేరుగా చంద్రుడి దక్షిణ ధృవంపై దించడానికి నాసా సన్నాహాలు చేస్తోంది. దానికి ముందుగా ఓరియన్ వ్యోమనౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, నావిగేషన్, ,డీప్-స్పేస్ లో వ్యోమగాముల భద్రత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరీక్షించడమే ఆర్టెమిస్ 2 ప్రధాన ఉద్దేశం.

ఈ ప్రయోగం భవిష్యత్తులో చంద్రుడిపై స్థావరం ఏర్పాటు, అంగారక గ్రహం (Mars) పైకి మనుషులను పంపే సుదీర్ఘ ప్రయాణాలకు ఒక కీలక పునాదిగా మారనుంది.