ఆదివారమే నీట్..ఆలస్యమైతే అనుమతించరు

ఆదివారమే నీట్..ఆలస్యమైతే అనుమతించరు

హైదరాబాద్, వెలుగు: వైద్యవిద్య ప్రవేశాల కోసం జాతీయ అర్హత పరీక్ష (నీట్) ను ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. 499 సిటీల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. విదేశాల్లో కూడా14 చోట్ల నీట్​ సెంటర్లను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించనున్నారు. మన రాష్ట్రంలో 22 సెంటర్లలో నీట్  ఎగ్జామ్  జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

మన రాష్ట్రం నుంచి 50 వేల మందికిపైగా విద్యార్థులు నీట్  ఎగ్జామ్ రాస్తున్నారని అధికారులు తెలిపారు. వాచ్​లు, బ్రాస్​లెట్, బంగారు ఆభరణాలు, ఫుడ్​ ఐటెమ్స్, వాటర్​ బాటిల్స్​ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. సంప్రదాయ దుస్తులు, వస్తువులతో వస్తే కనీసం రెండు గంటల ముందే వచ్చి పరీక్ష కేంద్రంలో రిపోర్టు​చేయాలని సూచించారు. లాంగ్​ స్లీవ్  దుస్తులను అనుమతించబోమని పేర్కొన్నారు.

అలాగే బూట్లు వేసుకుని రాకూడదని వెల్లడించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష ఉంటుందని, 1.30 తర్వాత స్టూడెంట్లను ఎగ్జామ్  హాల్లోకి అనుమతించరని తెలిపారు. విద్యార్థులు హాల్​టికెట్​తో పాటు ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్​ను తీసుకురావాలని అధికారులు సూచించారు.