CSK vs Sun TV: సీఎస్‌కే– ఎస్ ఆర్హెచ్ మధ్య వివాదం.. కోర్టులో కొత్త ట్విస్ట్

CSK vs Sun TV: సీఎస్‌కే– ఎస్ ఆర్హెచ్ మధ్య వివాదం.. కోర్టులో కొత్త ట్విస్ట్

CSK vs Sun TV: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ (సన్ టీవీ నెట్‌వర్క్) మధ్య తీవ్ర వివాదం కొనసాగుతుంది. కాపీరైట్ వివాదం సోమవారం (మార్చి 16న) మద్రాస్ హైకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించిన వివరాలను CSKCL తాజాగా ప్రకటన చేసింది. సీఎస్‌కే తమ ప్రమోషన్లలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’, ‘కూలీ’ సినిమాల పాటలు, డైలాగులు ఉపయోగించినందుకు ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (PPL), నోవెక్స్ కమ్యూనికేషన్స్ వంటి మ్యూజిక్ లైసెన్సింగ్ ఏజెన్సీలను సంప్రదిస్తామని కోర్టుకు తెలిపింది. ఈ ప్రక్రియలో సన్ టీవీ నెట్‌వర్క్ జోక్యం చేసుకోకూడదని కూడా కోరింది.

వివాదానికి అసలు కారణం: 
సీఎస్‌కేపై సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌కు చెందిన సన్ టీవీ నెట్‌వర్క్ కోర్టులో కేసు వేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తమ జెర్సీ విడుదల కోసం చేసిన ప్రమోషనల్ వీడియోలో ‘జైలర్’, ‘జైలర్ 2’, ‘కూలీ’ సినిమాల మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగులని పర్మిషన్ లేకుండా ఉపయోగించిందని ఆరోపించింది. ఈ వీడియోను సీఎస్‌కే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రిలీజ్ చేయగా, దానికి క్రికెట్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే కాపీరైట్ స్ట్రైక్‌లు రావడంతో సీఎస్‌కే ఆ వీడియోను తొలగించింది.

►ALSO READ | MS Dhoni: సెంటిమెంట్ నెంబర్ 7కు ధోనీ గుడ్బై : లక్కీ జెర్సీని నిజంగా వదులుకుంటున్నాడా..?

ఇప్పుడే ఎందుకు అభ్యంతరం: 
మార్చి 1వ తేదీన సన్ టీవీ నెట్‌వర్క్ నుంచి వచ్చిన వార్నింగ్ ఈ మెయిల్ తో సీఎస్‌కే ఆ కాపీరైట్ మెటీరియల్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. అనంతరం లైసెన్స్ పొందిన సంగీతంతో అదే వీడియోను మళ్లీ విడుదల చేసింది. నిన్న (మార్చి 16న) జరిగిన విచారణలో సీఎస్‌కే, తాము చట్టబద్ధంగా లైసెన్స్ పొందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమాల పాటలు, డైలాగులు తమ ప్రమోషన్లలో ఉపయోగిస్తున్నప్పటికీ, 2026 మార్చి 1వ తేదీ వరకు సన్ టీవీ నెట్‌వర్క్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని CSKCL పేర్కొంది.