MS Dhoni: సెంటిమెంట్ నెంబర్ 7కు ధోనీ గుడ్బై : లక్కీ జెర్సీని నిజంగా వదులుకుంటున్నాడా..?

MS Dhoni: సెంటిమెంట్ నెంబర్ 7కు ధోనీ గుడ్బై : లక్కీ జెర్సీని నిజంగా వదులుకుంటున్నాడా..?

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీపై గందరగోళం ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ధోనీ లక్కీ నంబర్ 7 జెర్సీని వదిలేస్తున్నట్లు కనిపించడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ధోనీ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి షేర్ కావడంతో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ధోనీ అంటే నంబర్ 7 జెర్సీనే గుర్తుకు వస్తుంది. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఐసీసీ టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ వంటి పలు ట్రోఫీలను అందించిన అతడు, తన జెర్సీ నంబర్ 7తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లోనూ, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే నంబర్‌తో ఆడాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఐపీఎల్ 2026లో ధోనీ తన జెర్సీ నంబర్‌ను 7 నుంచి 8కి మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ వీడియో వాస్తవమా లేదా ఏదైనా ప్రకటనలో భాగంగా ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ధోనీ నంబర్ 7ని ఎంపిక చేసుకోవడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. ఆయన పుట్టిన తేదీ జూలై 7 (7వ తేదీ, 7వ నెల). అంతేకాకుండా అతడు పుట్టిన సంవత్సరం 1981 ఇందులో 8+1 కలిపితే 9 అయినప్పటికీ, 7తో ఉన్న అనుబంధం కారణంగా ఆ నంబర్‌ను ఎంచుకున్నట్లు ఒక సందర్భంలో ధోనీ వెల్లడించాడు. ఇక 2023లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహేంద్రుడు చేసిన సేవలను గౌరవిస్తూ అతని నంబర్ 7 జెర్సీని రిటైర్ చేసింది. దీంతో భవిష్యత్తులో భారత జట్టులో ఎవరూ ఆ నంబర్‌ను ఉపయోగించలేరు. సచిన్ టెండూల్కర్ నంబర్ 10 తర్వాత రిటైర్ అయిన రెండో జెర్సీ ధోనీదే.