ఏఎస్ఐ కాల్పులు.. ఒడిశా మంత్రి మృతి

ఏఎస్ఐ కాల్పులు.. ఒడిశా మంత్రి మృతి
  • నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు

భువనేశ్వర్ : ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిశోర్  దాస్ పై అసిస్టెంట్  సబ్  ఇన్ స్పెక్టర్ (ఏఎస్ఐ) కాల్పులు జరిపాడు. తుపాకీతో చాలా దగ్గరి నుంచి రెండు రౌండ్లు ఫైరింగ్  చేశాడు. కాల్పుల్లో  తీవ్రంగా గాయపడిన మంత్రి.. భువనేశ్వర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఝార్సుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్  టౌన్ లో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది. బ్రజ్ రాజ్ నగర్  లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి కారులో వెళ్లారు. ఆయన కారు దిగగానే ఏఎస్ఐ గోపాల్ దాస్  మంత్రి ఛాతీపై పాయింట్  బ్లాంక్ లో కాల్పులు జరిపాడు. ఆపై పారిపోయేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా రక్తమోడుతున్న మంత్రిని కారులో ఝార్సుగూడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ లో భువనేశ్వర్ లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. భువనేశ్వర్ లో హెలికాప్టర్  చేరుకున్నాక పోలీసులు గ్రీన్  చానెల్  ఏర్పాటు చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంత్రి తుదిశ్వాస విడిచారని డాక్టర్లు తెలిపారు. ‘‘బుల్లెట్ మంత్రి ఛాతీలో దిగి ఆయనకు తీవ్రంగా బ్లీడింగ్  అయింది. ఐసీయూ కేర్ లో ఉంచి గాయాన్ని రిపేర్  చేసినం. మంత్రిని బతికించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది” అని అపోలో హాస్పిటల్  ఓ బులెటిన్ లో తెలిపింది.

కాల్పులపై ఎంక్వయిరీకి ఆదేశం: సీఎం నవీన్

మంత్రి నబా కిశోర్  దాస్  మరణ వార్త తెలిసి సీఎం నవీన్  పట్నాయక్  దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాల్పులను ఆయన ఖండించారు. 
‘‘ప్రభుత్వానికి, పార్టీకి కిశోర్  దాస్  ఓ ఆస్తి. హెల్త్  డిపార్ట్ మెంట్లో ఎన్నో బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు” అని ముఖ్యమంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి కిశోర్  దాస్  ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సీఎం పరామర్శించారు. కాల్పుల ఘటన విని షాక్  అయ్యానని చెప్పారు. కేసు దర్యాప్తు చేయాలని క్రైం బ్రాంచ్ ను ఆదేశించానని వెల్లడించారు. మంత్రి కిశోర్  దాస్ మృతితో బ్రజ్ రాజ్ నగర్ లో టెన్షన్  నెలకొంది.  సెక్యూరిటీ లాప్స్  జరుగుతోందని కిశోర్  సపోర్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రిని హత్య చేసేందుకు ముందే కుట్రపన్నారని పేర్కొన్నారు.

ఏఎస్ఐకు మానసిక సమస్యలు

మంత్రిపై తన భర్త గోపాల్  దాస్  కాల్పులు జరిపాడన్న వార్త విని తాను కూడా షాకయ్యానని ఆయన భార్య జయంతి తెలిపారు. గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో తన నివాసంలో మీడియాతో ఆమె మాట్లాడారు. మంత్రితో తన భర్తకు ఎలాంటి శతృత్వం లేదని చెప్పారు. అయితే గత ఎనిమిదేండ్లుగా ఆయన మానసిక అనారోగ్యంతో  బాధపడుతున్నాడని, అందుకు మందులు తీసుకుంటున్నాడని ఆమె వెల్లడించారు. ఆదివారం ఉదయం తమ కూతురికి వీడియో కాల్  కూడా చేశాడన్నారు. కానీ ఇంత పని చేస్తాడనుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటపడతాయన్నారు. మరోవైపు ఏఎస్ఐ గోపాల్  దాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, మంత్రి కిశోర్  దాస్  2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్  నుంచి బీజేడీలోకి మారారు.