కంటెంట్ ఉన్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు . హీరోలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఇప్పుడు వైవిధ్యమైన కథతో అన్నపూర్ణ స్టూడియోస్ మరో ఆసక్తికరమైన చిన్న బడ్జెట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. గ్రామీణ నేపథ్యంలో 'పల్లబురుసు' చిత్రాన్ని నిర్మిస్తోంది . ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఆసక్తిని రేకెత్తించగా.. లేటెస్ట్ గా టీజర్ ను హీరో నాగచైతన్య చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఈ టీజర్ మరింత పెంచేసింది. సహజమైన హాస్యం, హృద్యమైన కుటుంబ భావోద్వేగాలు, పల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబించే సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ యాద్మా, గోమతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టీజర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం తండ్రి-కొడుకుల మధ్య జరిగే ఆసక్తికర సంఘటనల చుట్టూ తిరుగుతుంది. తనకు టూత్‌బ్రష్ కొనివ్వాలని తండ్రి పదేపదే అడుగుతుంటే.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కొడుకు పరిస్థితి ప్రేక్షకుల్లో నవ్వులు పూయించేలా చూపించారు. అదే సమయంలో వారి బంధంలోని భావోద్వేగాలను కూడా దర్శకుడు హృద్యంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.
►ALSO READ | ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే DMK, AIDMK అవుట్.. పోటీ విజయ్‌తోనే .. సీఎం జ్యోతిష్యుడి జోస్యం!
ఇక గ్రామంలోని ఓ బార్బర్ ప్రేమకథకు సంబంధించిన సన్నివేశాలు కథలో మరో వినోదభరిత కోణాన్ని జోడించనున్నాయి. పల్లెటూరి భాష, సహజమైన పాత్రలు, జీవితానికి దగ్గరగా ఉండే సంఘటనలు సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. కామెడీతో పాటు హార్ట్‌టచింగ్ ఎమోషన్స్‌ను సమపాళ్లలో మిళితం చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసినట్లు టీజర్ స్పష్టంగా చెబుతోంది.
ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, కథనం, దర్శకత్వం వహించగా.. ఎపిక్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు పవన్ CH స్వరాలు అందిస్తున్నారు. ఆగస్టు 14, 2026న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది.
