కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన ఫ్యాన్స్ ను ఉద్దేశించి కేవలం సినిమా వేడుకలు, ఆడియో లాంచ్‌లకే పరిమితం కాకుండా ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అంతే కాకుండా ధనుష్ మున్ముందు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ ఆయన తండ్రి కస్తూరి రాజా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ సార్ట్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న అభిప్రాయం సినీ, రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ధనుష్ రాజకీయాల్లోకి వస్తే?
అయితే ధనుష్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయా? అన్న ప్రశ్న ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తమిళనాడు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన అంచనాలు వెల్లడించారు. ఇప్పటికే నటుడు విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కజగం ద్వారా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో.. భవిష్యత్తులో సినీ ప్రముఖుల రాజకీయ ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తుకు ఛాన్స్..!
విజయ్ రాజకీయ ఎదుగుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని సంప్రదాయ రాజకీయ శక్తులు కొత్త వ్యూహాలను అనుసరించాల్సి రావచ్చని, ఒక దశలో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన ద్రవిడ పార్టీల మధ్య అనూహ్యమైన పొత్తు పరిస్థితులు కూడా రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
విజయ్ వర్సెస్ ధనుష్..
ఇదే సమయంలో ధనుష్ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారతాయని జ్యోతిష్యుడు అభిప్రాయపడ్డారు. ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే, తమిళనాడు రాజకీయాల్లో రెండో అతిపెద్ద శక్తిగా ఎదిగే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. భవిష్యత్తులో తమిళ రాజకీయాలు విజయ్ వర్సెస్ ధనుష్ అనే కొత్త పోటీ దిశగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు.
►ALSO READ | Samantha Baby Bump: బేబీ బంప్‌తో మెరిసిన సమంత.. మదర్‌హుడ్ గ్లోకు ఫ్యాన్స్ ఫిదా!
ధనుష్ జాతకాన్ని పరిశీలించిన పండిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు, ప్రజలను ఆకర్షించే శక్తి, ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే జ్యోతిష్య సూచనలు ఒక అంచనా మాత్రమేనని, రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న తుది నిర్ణయం పూర్తిగా ధనుష్ వ్యక్తిగత ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు వస్తారో?
ప్రస్తుతం ధనుష్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయనకు తమిళనాడులో భారీ అభిమాన గణం ఉంది. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, గాయకుడు, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్న ధనుష్ రాజకీయాల్లోకి వస్తే యువతను ఆకర్షించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే ధనుష్ నిజంగా రాజకీయ అరంగేట్రం చేస్తారా? చేస్తే ఆయన ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు వస్తారు? అన్నది భవిష్యత్తే నిర్ణయించాలి. కానీ జ్యోతిష్యుడి తాజా వ్యాఖ్యలు మాత్రం తమిళ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరలేపాయి..
