
పాలబుగ్గల పసివాళ్లు... మంచీ.. చెడు తెలియని ప్రాయం.. కల్లాకపటం లేని మనస్తత్వం.. ప్రేమగా దగ్గరికి పిలిస్తే.. గారాలు పోతూ ఒళ్లో ఒదిగిపోతారు.. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ప్రేమగా ఒళ్లో కూర్చోబెట్టుకోవాల్సిన వాళ్లే.. చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒళ్లు మరిచిపోతున్నారు. మరి.. మీ పిల్లలు భద్రమేనా? పెద్దలూ.. జర పిల్లలు పైలం!
తొమ్మిది నెలల పసిబిడ్డ. అమ్మా అని పిలపడం కూడా పూర్తిగా రాని పసితనం. ఏడిస్తేనే, మొఖమంతా రక్షం పేరుకు పోయేంత సుకుమారత్వం, పాలు తాగే పెదాలు కూడా గులాబీ మొగ్గల కంటే సున్నితంగా ఉండే వయసు.. కానీ.. ఓ ఉన్మాది కామానికి గురయింది. ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోయింది. ఈ ఘటన మరిచిపోకముందే.. మరో ఘటన తొమ్మిది సంవత్సరాల బాలికమీద మరో ఉన్నాది అత్యాచారం, ఆ బాలిక ఇప్పుడు హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉంది. అసలెక్కడున్నాం మనం? పసిపిల్లల పట్ల కూడా కామంతో ఆలోచించే ఉన్నాదులున్న ఈ సమాజంలో పిల్లలు పదిలంగా ఉన్నారా? ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలో కూడా తెలియని స్థితిలో ఎంతోమంది అడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల్ని కాపాడడానికి ఎవరో రారు. వారికి మనమే రక్షగా ఉండాలి. అవగాహన, అప్రమత్తతే వారికి ఏ ఆపద రాకుండా నిలువరించగల ఏకైక మార్గం..
నిత్యం దేశంలో ఏదో ఒక చోట పసిపిల్లల మీద అత్యాచారాలు, లైంగిక దాడులు, రోజూ మామూలుగా కనిపించే వారే ఎవరూ లేని సమయంలో పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కామం నిండిన కళ్లతో వారి మీద లైంగిక దాడి చేస్తున్నారు. పిశాచాల్లాంటి ఉన్నాదుల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే అప్రమత్తత ఒక్కటే దారి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునే లోపు.. ఇంకా ఎన్నో పసిప్రాణాలు తల్లడిల్లిపోతాయి. లైంగిక వేధింపులు అనే పదానికి అర్ధం కూడా తెలియని వయసులో వారు ఆ వేధింపులకు గురికావడం ఏంటి? ఎటు పోతున్నాం మనం? ఈ పైశాచికత్వ కోరల నుంచి పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?
ఓ నివేదికలో విస్తు పోయే నిజాలు:
మనదేశంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల్లో చాలా కొద్దిశాతం మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. దీనికి కారణం.. చాలా సందర్భాల్లో దానికి కారణమైనవారు కుటుంబ సభ్యులో, బంధువులో, బాగా నమ్మకమున్న వారో అయి ఉండడం. మనదేశంలో 53 శాతం మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని కేంద్ర శిశు సంక్షేమశాఖ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
►ALSO READ | ఓవర్ డ్రింకింగ్‌తో తల పట్టేస్తోందా.. సిట్టింగ్‌కు ముందు ఈ టిప్స్ పాటిస్తే హ్యాంగోవర్ సమస్యే ఉండదు !
చాక్లెట్లు, బొమ్మలు ఆశగా చూపి వారి మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అసలు పిల్లల మీద జరిగింది లైంగిక దాడా? లైంగిక వేధింపా? అనేది కూడా నిర్వచించడానికి వారి వయసు క్లిష్టంగా మారుతున్నదని నివేదికలో తేలింది. స్కూళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కేర్ టేకర్ సెంటర్లు, లేడీస్ క్లబ్బులు, హాస్టల్స్, ప్లేస్కూల్స్, ట్యూషన్లు.. ఇలా ఎక్కడైనా పిల్లలు లైంగిక వేధింపులకు గురికావచ్చు, కుటుంబ సభ్యులు, బంధువులు, టీచర్లు, కోచ్, జయాలు, పక్కింటివాళ్లు, పరిచయస్తులు, ఆపరిచితులు ఎవరైనా పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేయొచ్చు, కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలంటే అప్రమత్తత, అవగాహన, చైతన్యమే మార్గం..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- పిల్లజను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదలద్దు.
- పిల్లలతో చనువుగా ఉండేవారిని ఓ కంట కనిపెట్టండి.. వారి వివరాలు తెలుసుకోండి.
- తెలియని వారితో పిల్లలను బయటకు పంపకండి.
- పిల్లలతో చనువుగా ఉండండి. రోజులో జరిగిన అన్ని విషయాలు మీతో పంచుకునే వాతావరణం కల్పించాలి.
- వయసులో పెద్దవారితో పిల్లల స్నేహాన్ని గమనిస్తూ ఉండాలి..
- అపరిచితులు, అనుమానిత వ్యక్తులు పిల్లల్ని అనుసరిస్తున్నట్టు.. వారితో పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుప్నుట్టు గమనిస్తే అప్రమత్తం అవండి. హెచ్చరించండి. పిల్లలను అప్రమత్తం చేయండి. పోలీసులకు సమాచారం ఇవ్వండి.
- టెక్నాలజీ సాయంతో పిల్లల కదలికలు, మంచిచెడులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.