వంట గ్యాస్ కష్టాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. చిరు వ్యాపారుల ఉపాధి గల్లంతు అవుతుంది. అన్నింటికి కంటే ముఖ్యంగా.. ఫుడ్ డెలివరీ బాయ్స్ పీకల్లోతు కష్టాల్లో పడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లయ్ నిలిపివేతతో.. హోటల్స్ అన్నీ మూసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ హోటళ్లపై ఆధారపడిన గిగ్ వర్లర్లు.. అదేనండీ ఫుడ్ డెలివరీ బాయ్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. డెలివరీ ఆర్డర్లు తగ్గిపోయి.. ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాంలు తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గిగ్ వర్లర్లు.. ఒక్కో గిగ్ వర్కర్ కు 10 వేల రూపాయలుఇవ్వాలని.. జొమాటో. స్విగ్గీ కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల కొరత ఇప్పుడు గిగ్ వర్కర్ల పొట్ట కొడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో డిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు, చిన్న చిన్న ధాబాలు కూడా మూతపడుతున్నాయి. దీని ప్రభావం నేరుగా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి జీవిస్తున్న డెలివరీ బాయ్స్ పై పడింది. హోటళ్లలో వంటలు వండటానికి గ్యాస్ లేకపోవడంతో ఆర్డర్లు తీసుకోవటం నిలిపేశాయి సదరు సంస్థలు.
ఈ క్రమంలో గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్(GIPSWU) సంచలన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. రెస్టారెంట్లు మూతపడటంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు దాదాపు 50 నుంచి 60 శాతం వరకు పడిపోయాయని యూనియన్ పేర్కొంది. గంటల తరబడి రోడ్లపై వేచి చూస్తున్నా ఆర్డర్లు రాకపోవడంతో డెలివరీ బాయ్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని వెల్లడించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి డెలివరీ వర్కర్‌కు తక్షణమే రూ.10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని జొమాటో, స్విగ్గీ సంస్థలను యూనియన్ డిమాండ్ చేస్తోంది. ఈ చిరు సాయంతో కనీసం వారి కుటుంబాలు గడిచే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది యూనియన్.
►ALSO READ | గ్యాస్ లేదు.. కనీసం కిరోసిన్ అయినా పంపండి: కేంద్రానికి రేషన్ డీలర్ల రిక్వెస్ట్
కేవలం క్యాష్ సపోర్ట్ మాత్రమే కాకుండా.. రాబోయే 3 నెలల వరకు ఎవరినీ పనిలో నుంచి తొలగించకూడదని.. వారి ఐడీలు డీయాక్టివేట్ చేయకూడదని యూనియన్ డిమాండ్ చేస్తోంది. ఆర్డర్లు తగ్గిన సమయంలో కంపెనీలు వర్కర్లపై వేటు వేసే అవకాశం ఉన్నందున ఈ రక్షణ కల్పించాలని యూనియన్ కోరుతోంది. అలాగే ప్రతిరోజూ కనీస ఆదాయం గ్యారెంటీ ఇవ్వాలని.. లేదంటే గిగ్ వర్కర్ల జీవితాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేసింది.
గ్యాస్ కొరత అనేది హోటల్ యజమానుల సమస్య మాత్రమే కాదు.. దానిపై ఆధారపడి బతుకుతున్న కోట్ల మంది డెలివరీ బాయ్స్ జీవిత మనుగడ సమస్యగా మారింది ప్రస్తుత యుద్ధ వాతావరణంలో. ఎండనక, వాననక కష్టపడే గిగ్ వర్కర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు స్పందించాలని, ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకుని అక్రమంగా సిలిండర్లను దాచే బ్లాక్ మార్కెటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది గిగ్ వర్కర్ల యూనియన్.
