గ్యాస్ లేదు.. కనీసం కిరోసిన్ అయినా పంపండి: కేంద్రానికి రేషన్ డీలర్ల రిక్వెస్ట్

గ్యాస్ లేదు.. కనీసం కిరోసిన్ అయినా పంపండి: కేంద్రానికి రేషన్ డీలర్ల రిక్వెస్ట్

ముదురుతున్న గల్ఫ్ యుద్ధం సామాన్యుడి వంటగదిపై పెను ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ముడిచమురు, ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రేషన్ షాపు డీలర్లు కోరుతున్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కిరోసిన్ పంపిణీని పునరుద్ధరించాలని ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' ద్వారా ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లను అందిస్తూ.. కిరోసిన్ కోటాను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో కిరోసిన్ సరఫరా దాదాపు నిలిచిపోయింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కిరోసిన్ ఒక ఆపద్బాంధవుడిలా మారుతుందని డీలర్లు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ అందుబాటులో లేని పక్షంలో ప్రత్యామ్నాయ ఇంధనంగా కిరోసిన్ నిలుస్తుందని అంటున్నారు.

►ALSO READ | క్రూడ్ మంటల్లో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లు ఇవే..

యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగితే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు వంట చేసుకోవడం భారంగా మారుతుంది. అందుకే రేషన్ షాపుల ద్వారా రాయితీ ధరకే కిరోసిన్ అందించడం వల్ల వారికి భరోసా ఉంటుందని ఫెడరేషన్ తమ లేఖలో పేర్కొంది. కాలుష్య నియంత్రణలో భాగంగా కిరోసిన్‌ను పక్కన పెట్టినప్పటికీ.. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఇంధన అవసరాలే ప్రాధాన్యతని వారు గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయంతో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కూడా తమ డిమాండ్లను పంపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరతతో హోటళ్లు, ఐటీ కంపెనీలే ఇబ్బంది పడుతున్న వేళ.. పేదలకు రేషన్ కిరోసిన్ అందుబాటులోకి వస్తే అది పెద్ద ఊరట అవుతుంది. ప్రభుత్వం ఈ డిమాండ్‌పై ఎలా స్పందిస్తుందోనని కోట్లాది మంది రేషన్ కార్డుదారులు ఆసక్తిగా ఉన్నారు. గ్యాస్ సప్లైలో సమస్యలు నెలకొన్న ప్రస్తుత సమయంలో కిరోసిన్ పంపిణీ పునరుద్ధరణ నిర్ణయం పేదలకు కచ్చితంగా ఒక 'సేఫ్టీ నెట్'గా మారుతుందనడంలో సందేహం లేదు.