India Women's Hockey Team: ఆక్లాండ్ వేదికగా ఈరోజు (ఆదివారం) జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ (FIH Hockey Women's Nations Cup 2026) ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును 2–0 తేడాతో చిత్తు చేసి భారత అమ్మాయిలు చారిత్రాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత విజయంతో వచ్చే సీజన్ ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ ప్రో లీగ్‌కు (FIH Pro League) కూడా ఇండియన్ టీమ్ అర్హత సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన మన టీమిండియాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు.
న్యూజిలాండ్‌పై భారత అమ్మాయిల ఆధిపత్యం:
ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆట 4వ నిమిషంలోనే నవ్‌నీత్ కౌర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత 15వ నిమిషంలో సునేలితా టొప్పో మరో గోల్ చేయడంతో భారత్ 2–0 తో తిరుగులేని స్థితికి చేరుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఇండియన్ డిఫెండర్లు ప్రత్యర్థికి గోల్ చేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో గెలుపుని ఖాయం చేసుకున్నారు.
ఆ ఇద్దరికి అవార్డులు:
ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన భారత ప్లేయర్ లాల్‌రెమ్‌సియామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. మరోవైపు, టోర్నీ మొత్తంలో భారత స్టార్ స్ట్రైకర్ దీపిక ఏకంగా 6 గోల్స్ చేసి, అమెరికా ఫార్వర్డ్ ప్లేయర్ యాష్లే సెస్సాతో కలిసి టోర్నీ జాయింట్ హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచింది.
►ALSO READ | టెస్ట్ క్రికెట్లోకి కోహ్లీ రీ ఎంట్రీ..? కింగ్ స్టన్నింగ్ ఆన్సర్ ఇదే..!
రెండోసారి నేషన్స్ కప్ సొంతం:
భారత మహిళల జట్టు ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలవడంతో పాటు గ్రూప్ స్టేజ్‌లో అమెరికా (3-2), జపాన్ (2-1), ఉరుగ్వే (3-2) జట్లను ఓడించిన ఇండియా.. సెమీఫైనల్లో చిలీపై 6–0తో విజయం సాధించింది. తాజాగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి, 2022లో సాధించిన తొలి టైటిల్ తర్వాత భారత్ తన కెరీర్‌లో రెండోసారి ఈ ప్రతిష్టాత్మక నేషన్స్ కప్‌ను అందుకుంది.
టీమిండియాకు ప్రధాని మోడీ సెల్యూట్:
భారత జట్టు అద్భుత విజయం సాధించిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. ఇండియన్ హాకీ క్రీడాకారులు దేశానికి గర్వకారణం, ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు.. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్‌లో విజేతలుగా నిలిచిన మహిళల జట్టుకు అభినందనలు.. టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణంగా ఆడింది.. ఈ విజయం దేశంలోని మరెంతో మంది యువ అథ్లెట్లకు హాకీ ఆడేలా స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను అంటూ మోడీ ట్వీట్ చేశారు.
Indian hockey players bring pride and joy!
— Narendra Modi (@narendramodi) June 21, 2026
Congratulations to the women’s team for emerging as winners in the FIH Hockey Women’s Nations Cup. The team played exceptionally well throughout the entire tournament. Best wishes to the team.
May this win inspire several others to… pic.twitter.com/EdZcpyRV3L
