నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్.. 1970ల నాటి క్రైమ్ మిస్టరీ ‘రాఖ్’ ట్రైలర్ రిలీజ్!

 నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్.. 1970ల నాటి క్రైమ్ మిస్టరీ ‘రాఖ్’ ట్రైలర్ రిలీజ్!

ఓటీటీ ప్రియులకు నరాలు తెగే సస్పెన్స్‌తో కూడిన సరికొత్త వినోదాన్ని పంచేందుకు మరో విలక్షణమైన వెబ్‌సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ మాస్ అండ్ క్లాస్ నటుడు, 'మీర్జాపూర్' గుడ్డూ భయ్యా ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'రాఖ్' (Raakh). ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్‌గా రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సిరీస్ జూన్ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఊహించని మలుపులతో..

1970ల నాటి కాలేజీ రోజులు, నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అద్భుతమైన సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. గతంలో 'పాతాళ్ లోక్' వంటి సూపర్ హిట్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రొసిత్ రాయ్ ఈ సిరీస్‌ను రూపొందించడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ట్రైలర్ మొదట్లోనే ఒక భయంకరమైన నవ్వు, కళ్లతో మొదలై.. చూసే కొద్దీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. బాబు (ఆకాష్ మఖిజా), రజ్జో (రమణ్‌దీప్ యాదవ్) అనే ఇద్దరు టీనేజర్లు అనుమానాస్పద స్థితిలో క్రూరమైన నేరాలకు పాల్పడటం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మిస్సింగ్ అండ్ క్రైమ్ కేసును ఛేదించేందుకు సబ్ ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ (అలీ ఫజల్) రంగంలోకి దిగుతాడు. ఆ హంట్ ఏ రేంజ్‌కు వెళ్ళింది అనేదే అసలు కథ.

భావోద్వేగాల ప్రయాణం..

ఈ సిరీస్‌లో అలీ ఫజల్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనుండగా, సీనియర్ నటి సోనాలీ బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు రాకేష్ బేడీ, దివ్య శర్మ, దిబ్యేందు భట్టాచార్య లాంటి భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. ఎండెమాల్ షైన్ ఇండియా బ్యానర్‌పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాళిని జైన్, శ్యామ్ రాఠీలు ఈ సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

►ALSO READ | పెద్ది సినిమా టికెట్ల రేటు పెంపు.. శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్

కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా.. ఒక నేరం వల్ల బాధితుల కుటుంబాలు ఎంతలా విలవిలలాడతాయో, ఆ నరకాన్ని, భావోద్వేగాలను దర్శకులు అనుషా నందకుమార్, సందీప్ సాకేత్ అద్భుతంగా చూపించారు. జూన్ 12న ప్రైమ్ వీడియోలో ఈ ఇన్వెస్టిగేషన్ రైడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి...