ఢిల్లీ: లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి పక్షాల భేటీ ముగిసింది. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇండియా కూటమి నాయకులు, విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల నేతలతో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఓట్ చోరీని అరికట్టడం.. ఇవి రెండే తమ లక్ష్యాలని, ఎజెండాలోని అంశాలని స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని దుయ్యబట్టారు. సామాన్యుడి హక్కులను హరించివేస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు.
ప్రజాస్వామ్య భావాలను వ్యక్తపరచడానికి 'జంతర్ మంతర్' ఒక వేదికగా ఉండేదని, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య గళాన్ని వినిపించడానికి దానిని ఇకపై ఉపయోగించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని రాహుల్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని, తమ గళం కోసం భారత ప్రజలు పోరాడరని ప్రభుత్వం భావించడం అవివేకమని రాహుల్ అభిప్రాయపడ్డారు.
►ALSO READ | కేంద్ర మంత్రి పదవికి డాక్టర్ ఎల్. మురుగన్ రాజీనామా
ప్రధాన సూత్రధారి మోదీ, దానిని అమలు చేసిన అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ తమ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని గ్రహించాలని రాహుల్ చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, ఎటువంటి పర్యవసానాలు లేకుండా తప్పించుకోవడం అంత సులభం కాదని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
