వృశ్చిక రాశిలో 'బ్లూ మూన్': మే నెలలో శక్తివంతమైన పౌర్ణమి.. మీ రాశి ఫలాలు మారిపోతున్నాయా?

వృశ్చిక రాశిలో 'బ్లూ మూన్': మే నెలలో శక్తివంతమైన పౌర్ణమి.. మీ రాశి ఫలాలు మారిపోతున్నాయా?

2026 మే నెలలో ఆకాశంలో ఒక అరుదైన చంద్ర గ్రహణ వింత జరగబోతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, జ్యేష్ఠ అధిక మాసంలో వృశ్చిక రాశిలో ఏర్పడే ఈ పౌర్ణమిని 'బ్లూ మూన్' అని పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. ఈ సమయంలో చాలా మందిలో దాగి ఉన్న భావోద్వేగాలు బయటకు రావడం, కష్టమైన పరిస్థితులపై చర్చలు జరగడం, మనసులో పెద్ద మార్పులు రావడం వంటివి జరుగుతాయి.

వృషభ రాశిలో ఉన్న సూర్యుడికి, వృశ్చిక రాశిలో ఉన్న చంద్రుడికి మధ్య జరిగే ఈ శక్తి పోరాటం వల్ల... మనశ్శాంతికి, భావోద్వేగాల విడుదలకు మధ్య తీవ్రమైన ఘర్షణ ఎదురవుతుంది. వృశ్చిక రాశి అంటేనే రహస్యాలు, ముగింపులు, మానసిక మార్పులకు ప్రతీక. కాబట్టి ఈ పౌర్ణమి మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది.

మే 2026 పౌర్ణమి: తేదీ & సమయం
పౌర్ణమి తిథి ప్రారంభం: 30 మే 2026, శనివారం ఉదయం 11:58 గంటలకు.

పౌర్ణమి తిథి ముగింపు: 31 మే 2026, ఆదివారం మధ్యాహ్నం 02:14 గంటలకు.

మే 30 (రాత్రి): పౌర్ణమి పూజలు, ఆధ్యాత్మిక ఆచారాలు పాటించడానికి అనుకూలం.

మే 31 (పగలు): పౌర్ణమి వ్రతాలు, దానాలు చేయడానికి అనుకూలం.


ప్రతి రాశిపై బ్లూ మూన్ చూపే ప్రభావం 

1. మేష రాశి 
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సమస్యలు లేదా నమ్మకానికి సంబంధించిన విషయాలు ఈ సమయంలో బయటకు వస్తాయి. డబ్బు, ఉమ్మడి బాధ్యతలపై కుటుంబికులతో గంభీరంగా మాట్లాడాల్సి రావచ్చు. అన్నింటినీ మీ కంట్రోల్‌లో ఉంచుకోవాలని అనుకోకుండా, ప్రశాంతంగా మాట్లాడితేనే సమస్యలు తీరుతాయి.

2. వృషభ రాశి 
ఈ రాశి వారికి బంధాలు, భాగస్వామ్యాలు చాలా ముఖ్యం కానున్నాయి. ప్రేమ, పెళ్లి లేదా బిజినెస్ పార్ట్‌నర్‌షిప్‌లో దాగి ఉన్న కొన్ని నిజాలు బయటపడతాయి. కేవలం మీ సౌకర్యం కోసం లేదా గొడవలు ఎందుకని కొన్ని నిజాలను దాచిపెట్టి ఉంటే, ఈ పౌర్ణమి వాటికి ఒక స్పష్టతను ఇస్తుంది.

3. మిథున రాశి 
మీకు ఆరోగ్యం, దినచర్యలపై ప్రభావం కనిపిస్తుంది. విపరీతమైన పని ఒత్తిడి, అస్తవ్యస్తమైన నిద్ర, అలసట వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. కొంచెం నెమ్మదించి, మీ అలవాట్లను మార్చుకుని, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.

4. కర్కాటక రాశి 
ఈ బ్లూ మూన్ మీ ప్రేమ, పాత జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. పాత బంధాలు లేదా గతానికి సంబంధించిన విషయాలు అకస్మాత్తుగా గుర్తొచ్చి మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. మీరు నిజంగానే ఎదుటివారిని ప్రేమిస్తున్నారా లేక పాత జ్ఞాపకాలను పట్టుకుని వేలాడుతున్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది.

5. సింహ రాశి  
మీకు కుటుంబం, ఇంటి వాతావరణం ప్రధానాంశాలుగా మారతాయి. ఇంట్లోని పాత సమస్యలు లేదా ఆస్తి గొడవలు మళ్లీ చర్చకు రావచ్చు. సమాజంలో ఎంత విజయం సాధించినా, ఇంట్లో ప్రశాంతత లేకపోతే లాభం లేదనే విషయాన్ని ఈ పౌర్ణమి మీకు గుర్తు చేస్తుంది.

6. కన్యా రాశి 
మీకు మాట తీరు, కమ్యూనికేషన్ చాలా కీలకం. ముఖ్యమైన కాగితాల పని, ప్రయాణ ప్లాన్లు లేదా తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. కోపంగా ఉన్నప్పుడు ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, మాట జారకండి.

►ALSO READ | ఆకాశంలో జరిగే ఈ వింతను చూసి తీరాల్సిందే.. బ్లూ మూన్ ఎన్నిసార్లు వచ్చినా ఇది చాలా స్పెషల్..!

7. తులా రాశి  
డబ్బు విషయాలు, ఆర్థిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. మీ శక్తి, సమయం, డబ్బు ఎక్కడ వృధా అవుతున్నాయో ఈ పౌర్ణమి మీకు స్పష్టంగా చూపిస్తుంది. మీ ఖర్చులను, భవిష్యత్తు ప్లాన్లను ఒకసారి సరిగ్గా చూసుకోవడానికి ఇది మంచి సమయం.

8. వృశ్చిక రాశి 
చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల ఇతరుల కంటే మీకే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ ఆత్మగౌరవం, సొంత బంధాల గురించి లోతుగా ఆలోచిస్తారు. ఈ సమయంలో చిరాకు పడకుండా, ఆవేశంగా స్పందించకుండా, ప్రశాంతంగా మీ భావాలను పంచుకోవడం నేర్చుకోవాలి.

9. ధనుస్సు రాశి 
ఈ సమయం మీకు కొంచెం ఒంటరిగా, అంతర్ముఖంగా గడపాలనిపిస్తుంది. మానసిక అలసట, తెలియని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతిదానికీ వెంటనే పరిష్కారం వెతకాలని ఆరాటపడకుండా... కాసేపు విశ్రాంతి తీసుకుని, మిమ్మల్ని మీరు అంగీకరిస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

10. మకర రాశి  
మీరు మీ స్నేహితులు, సమాజంలో మీకున్న పరిచయాలు, మీ భవిష్యత్తు లక్ష్యాలను పునఃసమీక్షించుకుంటారు. కొందరు స్నేహితులతో లేదా గ్రూప్స్‌తో మీకు మానసిక బంధం లేదని తెలుసుకుంటారు. మీ మనశ్శాంతి కోసం కొంతమందికి దూరంగా ఉంటూ బౌండరీలు పెట్టుకోవడం మంచిది.

11. కుంభ రాశి  
మీకు ఉద్యోగం, కెరీర్ విషయాల్లో పెద్ద మార్పులు రావచ్చు. ఆఫీసులో జరిగే కొన్ని చర్చలు లేదా గందరగోళ పరిస్థితులు మిమ్మల్ని వ్యక్తిగతంగా బాధించవచ్చు. ఉద్యోగ బాధ్యతలు వేరు, మీ పర్సనల్ లైఫ్ వేరు అని గుర్తించి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి.

12. మీన రాశి
మీ ఆలోచనా విధానంలో, నమ్మకాల్లో పెద్ద మార్పు వస్తుంది. లాంగ్ జర్నీలు లేదా ఉన్నత చదువులకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే, మీ మనసుకు ఇప్పటికే తెలిసిన నిజాలను అంగీకరించడానికి ఈ పౌర్ణమి సహాయపడుతుంది.

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.