మగాళ్లకు న్యాయం కావాలె!

మగాళ్లకు న్యాయం కావాలె!
  • ‘ఫెమినిజం’కు వ్యతిరేకంగా సౌత్ కొరియాలో యూత్‌ ఉద్యమం
  • ఆడవాళ్లకు గవర్నమెంట్ జాబ్‌లు, స్కీంలు
  • మగాళ్లకు నిర్బంధ మిలటరీ సర్వీసా? అంటున్న యువకులు 

‘ఆడవాళ్లు కేసు పెడితే చాలు. ఆధారాల్లేకున్నా జైల్లో వేస్తారా? మేమేమో. రెండేండ్లు బలవంతంగా ఆర్మీలో పనిచేయాల్నా? మహిళలంతా ఉద్యోగాల్లో సెటిలైపోతే.. తర్వాత ఆర్మీ నుంచి మేం వచ్చి వాళ్ల కింద పనిచేయాల్నా? గవర్నమెంట్ స్కీములూ వాళ్లకే, ఉద్యోగాలూ వాళ్లకేనా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి సమానత్వం? అందుకే.. సైన్యంలో తప్పనిసరిగా చేరాల్సిందే అన్న రూల్‌ను స్త్రీలకూ వర్తింపచేయాలి. లేకుంటే ఆ రూల్ ఎత్తేయాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు గాక ఆగదు!’ దక్షిణ కొరియాలో ఇప్పుడు 20లు, 30ల మధ్య వయసున్న చాలా మంది యువకులు చేస్తున్న ఆందోళన ఇది.

‘మీటూ’కు యాంటీ మూమెంట్ షురూ

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ వీధిలో కొన్ని నెలల కిందట10 వేల మంది మహిళలు భారీ ర్యాలీ తీశారు. స్పై కెమెరాలను నిషేధించాలని, లైంగిక హింసకు ముగింపు పలకాలని కదం తొక్కారు. ఇటీవల అదే వీధిలో 40, 50 మంది యువకులూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. ‘నిజమైన లింగ సమానత్వం కావాలి. మగవాళ్లకు న్యాయం కావాలి’ అని నినదించారు. ప్రపంచమంతా మహిళలపై వివక్షను రూపుమాపాలని, లింగ సమానత్వం సాధించాలని అనేక ఆలోచనలు చేస్తుంటే సౌత్​కొరియాలో మాత్రం ఫెమినిజానికి వ్యతిరేకంగా రెవెల్యూషన్ మొదలైంది. జెండర్ ఈక్వాలిటీ పేరుతో ఆడవాళ్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ మగవాళ్లకు అన్యాయం చేస్తున్నారంటూ ఆ దేశ యువకులు నిరసన గళాలు విప్పుతున్నారు.

మగాళ్ల హక్కుల కోసం గ్రూపులు

సియోల్ ర్యాలీని ‘డాంగ్ డాంగ్ వీ’ అనే గ్రూపు నిర్వహించింది. మూన్ అనే కుర్రాడు దీన్ని స్టార్ట్ చేశాడు. ఇలాంటి గ్రూపులు ఇప్పుడు కొరియాలో పెరుగుతున్నాయి. గతేడాది 39 ఏండ్ల ఓ రెస్టారెంట్ ఓనర్ తనను వెనుక నుంచి అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ కేసు పెట్టింది. వెంటనే అతడికి 6 నెలల జైలు శిక్ష పడింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా మహిళలు ఆరోపణలు చేస్తే చాలు జైల్లో పెట్టడం ఏంటంటూ దేశమంతా యువకులు మండిపడ్డారు. ఈ ఘటన తర్వాతే 29 ఏండ్ల  మూన్ మగాళ్ల హక్కుల కోసం డాంగ్ డాంగ్ గ్రూపును ప్రారంభించి తరచూ మీటింగులు పెడుతున్నాడు.

యువకులు ఆర్మీలో చేరాల్సిందే

సౌత్ కొరియాలో 62 ఏండ్లుగా ప్రతి యువకుడూ సైన్యంలో రెండేళ్లు తప్పనిసరిగా పనిచేయాలన్న రూల్ అమలవుతోంది. శారీరకంగా ఫిట్ గా ఉండి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు కనీసం రెండేళ్లు మిలటరీలో తప్పకుండా పనిచేయాల్సిందే. ‘నేను సైన్యంలో పని చేస్తుండగా గాయపడ్డాను. కానీ నాకు పరిహారం, సర్వీసు ప్రయోజనాలు ఇవ్వలేదు. మగాళ్లు మాత్రమే తమ కలలను పక్కన పెట్టి సైన్యంలో చేరాలన్న రూల్ కరెక్టు కాదు’ అని పార్క్ వెల్లడించాడు. మహిళలు తప్పనిసరిగా సైన్యంలో చేరాలన్న రూల్ లేకపోవడంపై యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సైన్యంలో ప్రస్తుతం 5.5% మంది మహిళలు ఉన్నారు.

ప్రెసిడెంట్‌పై యువకుల గుస్సా

గతేడాది రియల్ మీటర్ పేరుతో ఓ సర్వే నిర్వహించగా 20లలో ఉన్న యువకుల్లో 76% మంది, 30లలో ఉన్నవారిలో 66% మంది యువకులు తాము ఫెమినిజానికి వ్యతిరేకమని చెప్పారు. దేశంలో జెండర్ సంబంధిత అంశాలే చాలా సీరియస్ విషయాలని 60% మంది యువకులు స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం మూన్ జే ఇన్ కు 20లలో ఉన్న యువకుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉండేది. కానీ ఇప్పుడు 30% మంది కూడా ఆయనకు సపోర్ట్ గా మాట్లాడటం లేదని రియల్ మీటర్ పోల్ లో వెల్లడైంది. మరోవైపు మహిళల నుంచి మద్దతు ఆయనకు బాగా పెరిగింది. ప్రస్తుతం 63.5% మంది లేడీస్ ఆయనకు మద్దతునిస్తున్నారు.

ఫెమినిజం అర్థం మారుతోంది

‘ఫెమినిజం అంటే ఇకపై జెండర్ ఈక్వాలిటీ ఎంత మాత్రం కాదు. అది లింగ వివక్ష. దాని తీరు హింసాత్మకంగా, ద్వేషపూరితంగా మారుతోంది. ఇది సమానత్వం కోసం కాకుండా స్త్రీల ఆధిపత్యం దిశగా పయనిస్తోంది’ అని మూన్ అంటున్నాడు. 2016లో సియోల్ శివార్లలో ఓ మహిళను అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన తర్వాత దేశంలో మహిళలకు మద్దతుగా ఉద్యమం జరిగింది. మగవాళ్ల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉన్న సౌత్ కొరియాలో మహిళల పట్ల వైఖరి మారాలంటూ ప్రచారం సాగింది. #మీటూ మూమెంట్ తరహాలో ‘#మై లైఫ్​ ఈజ్‌ నాట్ యువర్ పోర్న్’ పేరుతో  మూమెంట్ ఊపందుకుంది. ప్రస్తుత దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా ఆ ఉద్యమానికి మద్దతు పలికారు. తనను అధ్యక్షుడిగా గెలిపిస్తే ‘ఫెమినిస్ట్ ప్రెసిడెంట్’గా పని చేస్తానని, మహిళల హక్కుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన 2017లో అధ్యక్షుడు అయ్యాక అనేక చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి అనేక హై ప్రొఫైల్ కేసుల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన చాలామంది రాజకీయ నాయకులు, పాప్ స్టార్లు, ఇతరులను కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్కో కేసులో తీర్పు వెలువడిన కొద్దీ ఆ దేశ యువకుల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది.

లేడీస్‌కూ రూల్ పెట్టాలె

నిర్బంధ మిలటరీ సర్వీసుపై నిర్వహించిన ఓ సర్వేలో 20లలో ఉన్నవారిలో 72% మంది ఇది లింగ వివక్షే అని అభిప్రాయపడ్డారని కొరియన్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్ మా క్యుంగ్ హీ వెల్లడించారు. సైన్యంలో చేరడం లేడీస్ కు కూడా తప్పనిసరి చేయాలంటూ 65% మంది స్పష్టం చేశారన్నారు. మిలటరీలో చేరడం టైం వేస్ట్ వ్యవహారమని 68% మంది ఫీలయ్యారని చెప్పారు. రెండేళ్ల స్వేచ్ఛను కోల్పోవడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా మిస్ అవుతున్నాయని, దీనివల్ల జాబ్ మార్కెట్‌లో మహిళల కన్నా వెనకబడిపోతున్నామని చాలా మంది ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.