సమాజంలోని అసమానతలు అలానే మానవ సంబంధాల మధ్య నెలకొన్న వైరుధ్యాలను సహజ రీతిలో చిత్రీకరించిన చిన్న కథలు అనేకం ఈ పుస్తకంలో మిళితమై ఉన్నాయి. త్వరగా ముగిసినా.. తరుణోపాయం చెప్పగలిగే బోలెడు చిట్టి కథలున్న ఈ పుస్తకంలో...
మొదటి కథ.. కనకపోయినా పాలు అందించి మాతృత్వాన్ని శాశ్వతంగా నిలుపుకున్న బంధం..తల్లి లేని బిడ్డకు పాలు పట్టిన మరో తల్లి కథే ‘ప్రాణధార’. ప్రాణాంతకమైన వ్యాధిగా చెప్పుకునే ఎయిడ్స్కి చికిత్స లేదు. కానీ, ప్రస్తుతం ఉన్న వైద్య విధానాలతో ‘హెచ్ఐవీ’ని అదుపులో ఉంచవచ్చు. అలానే పుట్టబోయే పిల్లలకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ధైర్యం చెప్పే కథ ‘ఆపద అదుపులోకి వచ్చేనా?’.
యువత ఉన్నదాంట్లో సంతృప్తిని వెతుక్కుంటే.. ఎదగలేరు. సమాజానికి ఉపయోగపడనూలేరు. కాబట్టి పైకి ఎదగాలనే ఆశ, కసి వారిలో ఉండాలి. ఆశయం నిర్దేశించుకోవాలి. అది నెరవేర్చుకునేందుకు తగిన కృషి చేయాలి. అప్పుడే యువత వ్యక్తిగతంగా ఎదగడంతోపాటు దేశ ప్రగతికి తోడ్పడగలుగుతారనే చక్కని సందేశం అందించారు .
►ALSO READ | బతుకు కవిత్వం... అక్షరాలే అస్త్రాలు
‘శ్వాసకు ప్రాణవాయువు ఆశ, ఆశయం’ అనే మరో కథలో. ..దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ పట్టుదలకు పోయి కాపురాలు పాడు చేసుకోకూడదని నేటి సమాజపు పోకడలను ఉద్దేశించి చెప్పిన కథ ‘ఆపద్బాంధవి’.
గ్రామాల్లో అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన దొరికితే ఉపాధి, వృద్ధికి ఢోకా ఉండదనే నేపథ్యంలో సాగిన మరో కథ ‘గ్రామ సమృద్ధి, దేశాభివృద్ధి’.
మంచికి పోతే చెడు ఎదురైనట్టు, పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టుగా సాగే ఓ తమాషా కథ.. ‘ఉరుములేని పిడుగుపాటు’.
ఉన్న ఊరు వదిలి బొంబాయి నగరంలో వలస కార్మికునిగా చేరి, కొంతకాలం గడిచిన తర్వాత తమ సొంత రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన సందర్భంలో తిరిగి వచ్చి, ఆ గ్రామాభివృద్ధి పనులు చేపట్టి, ఎదిగిన తీరును ఎంతో హృద్యంగా మలచిన కథే ‘వలసల విజయం!’
స్మగ్లింగ్, డ్రగ్స్ లాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిని పట్టిస్తే వచ్చే డబ్బుల కోసం.. పాతికసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఓ దొంగ.. తన వృత్తిని మానేసి సమాజానికి ఉపయోగపడే మరో వృత్తిలోకి మారిన వైనమే ‘ఇది రజతోత్సవమే!’
ఓ జంట కొత్త ఇంట్లోకి మకాం మార్చారు. భర్తకు పెద్దగా ఇష్టం లేకపోయినా భార్యకు కుక్కలంటే వల్లమాలిన ప్రేమ. కానీ.. వాళ్ల అపార్ట్మెంట్లో కుక్కలను పెంచుకోవడం నిషేధం. అప్పుడు వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది ‘శునకాయణం’ కథ చదివితే తెలుస్తుంది.
ఇవేకాక ‘నిజం నిలకడ మీద’, ‘తోడు తోటే జీవితం’, ‘ఆటవిక న్యాయం’, ‘కాదనడం ఓ కళ’, ‘ఆశాలుకు పోశాలు జాబు’ లాంటి మరిన్ని చిట్టి కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.
పి. రాజ్యలక్ష్మి
NOTE : లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
