మన సమాజంలో అనేక గోడలు ఉన్నాయి. ఆ గోడల్ని చూసినప్పుడు నిజమైన కవి కలవరపడతాడు. వాటిని తొలగించడానికి తన అక్షరాలను అస్ర్తాలుగా ప్రయోగించాలి అనుకుంటాడు. ఆ పనిని నిరంతరం చేస్తున్న యువ కవే సందీప్ వొటారికారి. గోడలు లేని లోకం కావాలి. అదే తన స్వప్నం.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘‘ఎక్కడైతే మనిషి తలెత్తుకు జీవించగలడో...ఆ లోకానికి నన్ను నడిపించు ప్రభూ...’’అన్నట్టు ఈ కవి కూడా ఆకలి, అవమానాలు లేని లోకాన్ని కలగంటున్నాడు. ఈ దేశంలో కులం ఒక గోడ. మతం ఒక గోడ. లింగ వివక్షత మరొక గోడ. ఆ గోడలన్నీ కూలాలంటే ఈ సమాజంలో పరివర్తన రావాలి. ఆ పరివర్తనను బలంగా ఆకాంక్షించే కవిగా బలమైన గొంతుకతో ఈ యుద్ధభేరి మోగిస్తున్నాడు సందీప్.
భావుకత ఉన్న కవి
ఈ కవికి ప్రకృతికి, మనిషికి ఉండే సంబంధం తెలుసు. అందుకే మనిషిని చూసినా, ఒక సంఘటనను చూసినా వెంటనే ఈ కవి దానిని ప్రకృతి పోలికతో అందంగా పోల్చి చెబుతున్నాడు. నిజానికి జీవన సందర్భాలను ప్రకృతితో పోల్చాలంటే ఎంతో భావుకత కావాలి. ఆ భావుకత ఉన్న కవి సందీప్. ప్రతీ కవితలో పాఠకుడిని కట్టి పడేసే శైలిని క్రమంగా అలవర్చుకుంటున్నాడు. నాలుగు కాలాల పాటు పాఠకుల హృదయాల మీద చెరగని ముద్రను వేయగలిగే శక్తి ఈ కవిత్వంలో ఉందంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు సందీప్ పేరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కవుల జాబితాలో చేరుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు అని పోటీలు పడే కాలంలో సందీప్ మాత్రం తన హృదయస్పందనలను ఇట్లా కాపాడుకుంటున్నాడు. తనలోని సృజనకారున్ని నిదురపోనివ్వకుండా ఈ సమాజ దీపాన్ని కాపాడేందుకు తన రెండు చేతులు అడ్డుపెడుతున్నాడు. ఇది కవి సామాజిక బాధ్యత. ఈ బాధ్యతను వందశాతం నెరవేరుస్తున్న కవిగా సందీప్‌ను చూస్తున్నా. తాను చెప్పాలనుకునే విషయాన్ని గొప్ప కవితాత్మకంగా వ్యక్తీకరించడం సందీప్ సాధించిన శిల్పం.
‘ఎర్రమన్ను ఇల్లు’ అనే కవితలో
‘‘జానెడు చదరంగం పెట్టెల రెండు రాజ్యాలు ఇరికినట్టు
దోసిట్ల వట్టుకునే గల్ల గురిగంత మా ఇంట్ల
రూపాయి బిళ్ళలోలే ఇంతమందిమి” అంటాడు.
మూడేమూడు వాక్యాల్లో తన జీవితాన్ని పరిచయం చేశాడు. మూడు లైన్లల్లో మూడు పోలికలు చేశాడు. ఇది సందీప్ కవితా సాంద్రతను పట్టిస్తున్నది. ఇల్లును గల్లగురిగితో, తన కుటుంబ సభ్యులను కాసుల బిళ్ళలతో పోల్చాడు. అలాగే తన ఇంటి ఆవరణం ఎలా ఉందంటే జానెడంత చెస్ బోర్డులో రెండు రాజ్యాలు ఇరికినట్టు ఉందన్నాడు. ఇంత గొప్పగా ఇల్లును అభివర్ణించడం సందీప్‌కి ఎట్లా సాధ్యమైందా అనిపించింది.
గొప్పస్త్రీ వాది
ఈ కవిలో గొప్ప స్ర్తీవాది ఉన్నాడు. చాలా మంది బహుజన కులాల మగవాళ్లలో కూడా ఒక స్ర్తీమూర్తి ఉంటుంది. ఆయా సందర్భాల్లో వాళ్లు అమ్మ మనసుతో, ఆడబిడ్డ గుణంతో ఆలోచిస్తారు. ముఖ్యంగా ఈ సమాజంలో ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాల మీద దోసెడు అక్షరాలను గుమ్మరించేటపుడు పూర్తిగా పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే బహుజనుల ఇండ్లల్లో మగపిల్లలను ఆయా సందర్భాల్లో ‘‘నీది ఆడపిల్ల మనసురా’’అంటారు.
జెండర్ పాలిటిక్స్‌లో స్ర్తీల దుఃఖాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సందీప్‌లో మాత్రం ఆడవాళ్ల బాధలను, బతుకును అర్థం చేసుకోవడంలో గొప్ప మానవత్వం ఉంది. తనను కన్న తల్లిలాగే లోకంలోని అందరు ఆడవాళ్లను చూడడం, వారి బాధలకు తాను కన్నీరు పెట్టడం ఈ కవిత్వం నిండా పరుచుకుని ఉంది. ఇందులో సగానికి పైగా కవితల్లో బహుజన స్ర్తీల దుఃఖమే ఉంది. సందీప్ జీవితంలో తారసపడిన ప్రతీ స్ర్తీలో తాను ఒక బాధితురాలిని చూస్తున్నాడు.
అందుకే.. ‘షరతుల గోడ’అనే కవితలో...
‘‘మీరిప్పుడు ఆడపిల్లలను గాజు
బొమ్మలుగా పెంచకండి
స్వేచ్చ కోరి వాళ్లు నేలజారిపోతే..
సీసా పెంకుల్లా పగులుతారు
ఆ ఆంక్షల గోడకే గాజుముక్కల్లా అతుకుతారు
వీలైతే వాళ్ళకు ఉక్కు సంకల్పాన్ని
నూరి పోయండి
ఆ షరతుల గోడని బద్దలు కొట్టి
కొత్త ప్రపంచాన్ని కండ్లార చూస్తారు
వాళ్ళైనా మనుషులుగా బతుకుతారు” అంటాడు.
సామాజికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికీ స్ర్తీలు వ్యవసాయ కూలీ పనులతో పాటు బీడీలు చేస్తుంటారు. వరంగల్, కరీంనగర్‌లతో పాటు నిజామాబాద్ వంటి జిల్లాల్లో బీడీ పరిశ్రమ చాలా పెద్దది. కిందికులాల స్ర్తీలకు అదే పెద్ద ఉపాధి. అలాంటి కుటుంబం నుండి వచ్చిన సందీప్.. వారి ఆకలి పేగుల అరుపుల్ని, పూటగడవని వ్యథల్ని మరిచిపోలేదు. వాటన్నింటినీ సజీవంగా ఈ కవిత్వంలోకి పట్టుకొచ్చాడు. కూలీ చేసే ప్రతీ తల్లి బతుకు ఈ కవికి కవితావస్తువే.
మానని గాయాలు
తెలంగాణ సామాజిక స్వరూపం పట్ల సందీప్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ జీవితంలో వెలివాడల్లో తాను అనుభవించిన రాచపుండులాంటి పేదరికం నిత్యం సలుపుతూనే ఉంది. తనది చేదు గతం. ఆ గతాన్ని తాను మరిచిపోలేదు. అందుకే దానిని పలు కవితలుగా లిఖిస్తున్నాడు. సందీప్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా నెత్తురోడుతున్న జాడలే కనిపిస్తున్నాయి. ఆ మానని గాయాలు సలుపుతుంటే కన్నీరు కారుస్తూ కవిత్వం రాయకతప్పని పరిస్థితి. ఇందులో సందీప్ కూడా తన తండ్రి కష్టాన్ని, తల్లి త్యాగాన్ని పలుసార్లు గుర్తు చేసుకున్నాడు. అందుకే ఇది బతుకు కవిత్వం. బరి గీసిన కవిత్వం.
‘‘తొలకరి మట్టి వాసన తప్ప
కరెన్సీ కాగితపు వాసన తెలియని
సెట్టుతల్లి లాంటి మనిషి కావాలి
భూదేవిలా కడుపులో దాసుకోవాలి”అంటాడు
‘నాకొక మనిషి కావాలి’ కవితలో.
చెట్టులో తల్లిని చూశాడు, భూమి తనను మోస్తున్న విషయాన్ని మరిచిపోలేదు. అందుకే భూదేవిలా కడుపులో దాచుకోవాలని ఆకాంక్షించాడు.
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే మాటకు ఒక రూపం వస్తే అది సందీప్లాగే కనిపిస్తుంది. తాను యూనివర్సిటీ మెట్లెక్కడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో ఈ కవిత్వం చదివితే తెలుస్తుంది. ఆకలి, కన్నీళ్లు తనను నీడలా వెంటాడాయి. అయినా తాను తలవంచలేదు. రేపటి పట్ల విశ్వాసాన్ని వదులుకోలేదు. అంబేద్కర్ దారిలో భీం వారియర్ అయి ముందుకు సాగుతున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా తనలోని సృజన ఊటను ఆగిపోనివ్వలేదు. అక్కడే ఈ యువ కవి సక్సెస్ దాగి ఉంది.
కొత్త గొంతుకలు
సోషల్ మీడియా వల్ల నష్టాలున్నాయనే మాట పదే పదే వినిపిస్తుంటుంది. ప్రస్తుతం మాత్రం దాని వల్లే పుస్తకాల సమాచారం సులభంగా పాఠకులకు అందుతున్నది. అలాగే కొత్త గొంతుకలు పుట్టుకొస్తున్నాయి.
ఆ గొంతుకల్లో చాలామందికి లేని ప్రతిభ, విశాల అవగాహన సందీప్‌కు ఉంది. ముఖ్యంగా సాహిత్య ప్రయోజనం తెలుసు తనకు. అలాగే ఒక విషయాన్ని ఎట్లా కవిత్వంగా ఒదిగించవచ్చో తెలుసు. బహుశా తనకు ఆ తెలంగాణ గ్రామీణ జీవితం ఉండడం వల్ల కావచ్చు.
తెలుగు సాహిత్యాన్ని చదువుకోవడం వల్ల కావచ్చు, తన వ్యక్తిగత ఆసక్తి వల్ల కావచ్చు.. తాను కవిత్వ సృజన మెలకువలను మాత్రం త్వరగానే పట్టుకోగలిగాడని ఈ కవిత్వం చదివినప్పుడు ఎవరికైనా సులభంగానే అర్థమవుతుంది.
తాను కవిత్వం రాయడానికి జీవితంలోకి తొంగి చూస్తున్నాడు. జీవితమే కవిత్వం, కవిత్వమే జీవితం తనకు. అందుకే ఈ కవిత్వంలో ఒక తాజాదనం ఉంది. దుఃఖం ఉంది. ఓదార్పు ఉంది. ధర్మాగ్రహం ఉంది. వాటన్నింటిని పలికిస్తూ నిత్యం కవిగా జీవిస్తున్నాడు. అందువల్లే సందీప్ అక్షరాల్లో కవిత్వం పలుకుతున్నది. కొన్ని కవితల్లో తాను పోల్చిన పోలికలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.
‘‘పసికందుకు కాళ్ళ మీద తానమాడిచ్చినట్టు
పిల్ల కాలువలను పారిచ్చి పొలానికి తానమాడిస్తుండె”
అని ‘నాయిన మనసు’ కవితలో అంటాడు.
తన తండ్రి పొలానికి నీళ్లు పెడుతుంటే పసికందుకు కాళ్ల మీద స్నానం చేపిస్తున్నట్టు కనిపిస్తాడనడం ఎంత గొప్ప కవితాత్మక భావనాశక్తో అర్థం చేసుకోవచ్చు.చరిత్రకారుడు చరిత్రను బాహ్య స్వరూపం నుండి అర్థం చేసుకుంటాడు.
కవి మాత్రం, దాని అంతర్గత జీవనాడిని పట్టుకుంటాడు. అందుకే ఈ కవి కూడా సమాజ గమనాన్ని ప్రజల జీవితాల నుండి అర్థం చేసుకుంటున్నాడు. అందుకే బాధితుల వైపు నిలబడి మాట్లాడుతున్నాడు. వారి కోసం స్పందిస్తూ అనేక సందర్భాల్లో కవితా స్పందనలు వినిపిస్తున్నాడు.
డా.పసునూరి రవీందర్,
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత,
77026 48825.
NOTE : లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
