హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు దారి మళ్లించారు.ఢిల్లీ పర్యటన ముగించుకుని.. జూన్ 12సాయంత్రం 6.30 గంటలకు ఇండిగో విమానంలో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారడం.. భారీ వర్షం కురవడంతో విమానం ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా పోయింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు.. సీఎం విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్ చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయింది.
మరోవైపు హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా... చందానగర్, మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, జీడిమెట్ల, సనత్నగర్, అమీర్పేట, బోరబండ, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
