న్యూఢిల్లీ: ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సాగించిన ఉద్యమానికి పొరుగు దేశాలు ఫిదా అయ్యాయి. వారి ఆందోళనలతో ప్రభుత్వాన్ని దిగి వచ్చేటట్టు చేసి డిమాండ్లు నెరవేర్చుకోవడంలో అలుపెరగని పోరాటం చేసిన జెన్ జీకి పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. తమ దేశాల్లో ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయే వాళ్లు ఉంటారని, ఉద్యమాలు చేసే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్వార్తపత్రికల్లోని ఎడిటోరియల్స్ కూడా విద్యార్థులను ప్రశంసించాయి.
శ్రీలంక కార్టూనిస్ట్ అవంత అర్టిగల.. ‘లక్ష్మణ రేఖతో ఈ కాక్రోచ్‌లను ఆపడం సాధ్యం కాదు’ అని వేసిన కార్టూన్ వైరలైంది. ముంబైలో రియా అహిర్ అనే యువతి పోలీసు వ్యాన్‌కు అడ్డుగా నిలబడిన ఫొటోను 1989 నాటి చైనా ‘ట్యాంక్ మ్యాన్’ చారిత్రక ఫొటోతో పోల్చారు. శ్రీలంక ఉద్యమ నాయకుడు బువానక పెరేరా స్పందిస్తూ.. భారత రాజ్యాంగ పీఠికపై ఇప్పటికీ నిలబడే యువతను చూస్తుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయన్న సందేశం నెటిజన్ల మనసులను గెలుచుకుంది.
ఖాట్మండుకు చెందిన కంటెంట్ క్రియేటర్ అవినాశ్మిశ్రా మాట్లాడుతూ.. ‘‘మీరు పడుతున్న ఆవేదన సరైనదే. లక్ష్యం వైపు ముందుకు సాగండి’’ అంటూ యువతకు ధైర్యాన్నిచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన క్రియేటర్ బిలాల్ హసన్ మాట్లాడుతూ.. ‘‘మా దేశంలో ఒక ప్లేట్ బిర్యానీ ఇస్తే చాలు జనాలు అమ్ముడుపోతారు. ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు.
భారత్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ మా వద్ద అయితే మనుషులను కిడ్నాప్ చేస్తారు. ఒకవేళ బలోచ్ తెగకు చెందినవారైతే అసలు బతికున్నారో లేదో కూడా తెలియదు’’ అని సంచలన విషయాలు బయటపెట్టారు. భారత్‌లో నిరసనలకు పాకిస్తాన్ ఫండింగ్ ఇచ్చిందనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘‘మా దేశాన్ని నడిపించడానికే మా దగ్గర డబ్బులు లేవు. ఇక భారత్‌లో పోరాటాలకు మేమేం ఫండింగ్ ఇస్తాం’’ అని అన్నారు.
