మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఆగస్టు నుండి మారనున్న 7 రూల్స్ ఇవే..

 మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఆగస్టు నుండి మారనున్న  7 రూల్స్ ఇవే..

సాధారణంగా ప్రతి  నెల నెలా గ్యాస్ సిలిండర్ల ధరలు, బుకింగ్ విధానాలు, నిబంధనలలో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు ఎల్‌పీజీ (LPG), పీఎన్‌జీ (PNG) కనెక్షన్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చాయి. మీరు కూడా గ్యాస్ సిలిండర్ వాడేవారైతే, వీటి గురించి తప్పకుండ  తెలుసుకోవాలి.

1. గ్యాస్ కనెక్షన్ కోసం 'భారత్ లైట్ జిప్'
గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే రోజుల తరబడి ఎదురుచూసే ఇబ్బంది లేకుండా భారత్ పెట్రోలియం (BPCL) ఒక కొత్త సర్వీస్ తెచ్చింది. దీని ద్వారా ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే కొత్త గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు, అంతేకాకుండా సిలిండర్ అత్యంత వేగంగా ఇంటికి డెలివరీ చేయబడుతుంది. ప్రస్తుతం ఈ సర్వీస్  ముంబైలో ఉండగా, 2026 ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లోని మరో 100 నగరాలకు విస్తరించనున్నారు.

2. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా  సిలిండర్లు
ఇకపై గ్యాస్ సిలిండర్ కావాలంటే ప్రత్యేకంగా బుక్ చేసి ఎదురుచూడాల్సిన పనిలేదు. స్విగ్గీ (Swiggy Instamart) ద్వారా క్షణాల్లో గ్యాస్ సిలిండర్ తెప్పించుకోవచ్చు. హెచ్‌పీసీఎల్ (HPCL) సంస్థ స్విగ్గీతో కలిసి 10 కేజీల 'హెచ్‌పీ నవ్య' కాంపాక్ట్ సిలిండర్లను, 5 కేజీల మినీ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చింది. చిన్న కుటుంబాలు, అపార్ట్‌మెంట్లలో ఉండే వారు, స్టూడెంట్స్ కోసం ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ బెంగళూరులో ప్రారంభమైంది.

3. ఉజ్వల గ్యాస్ సబ్సిడీ కట్ 
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో సంవత్సరానికి 9 సిలిండర్లకు ఇస్తున్న సబ్సిడీని ఇప్పుడు సంవత్సరానికి కేవలం 4 సిలిండర్లకు కుదించారు. ప్రభుత్వ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

►ALSO READ | ఏఐ దెబ్బకు monday.comలో 600 మంది అవుట్.. ఒక్క ఏడాదిలోనే 1.4 లక్షల ఉద్యోగాలు మటాష్ !

4. వంటింటి గ్యాస్ ధరల్లో మార్పు 
ఇంట్లో వంట చేసుకునే సామాన్యులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. 14.2 కేజీల సాధారణ వంటింటి గ్యాస్ సిలిండర్ ధరలను ఈ నెలలో పెంచలేదు, అలాగే పాత ధరలనే కొనసాగించారు.

5. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గింపు
హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ బండ్లు నడిపే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఈసారి తగ్గించారు. దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి కమర్షియల్ సిలిండర్ పై దాదాపు రూ. 170 నుంచి రూ. 182 వరకు ధర తగ్గింది.

6.  30 రోజుల్లో  సరెండర్ చేయాలి
మీ ఇంట్లోకి ఒకవేళ పీఎన్‌జీ (పైప్ ద్వారా వచ్చే గ్యాస్) కనెక్షన్ తీసుకుంటే, కనెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోపు మీ పాత సిలిండర్ (ఇండేన్, భారత్ లేదా హెచ్‌పీ) కనెక్షన్‌ను రద్దు చేసుకోవడం లేదా సరెండర్ చేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు గ్యాస్ పైప్‌లైన్ సౌకర్యం లేని వేరే ప్రాంతానికి మారితే, మీ LPG కనెక్షన్‌ను మళ్లీ తీసుకోవడానికి 'ట్రాన్స్ఫర్ వోచర్' తీసుకోవచ్చు.

7. గ్యాస్ బుకింగ్, డెలివరీపై ఇతర  నిబంధనలు
*గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగకుండా డిజిటల్ పద్ధతిలోనే అంటే ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
*గ్యాస్ డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక కోడ్ (OTP) వస్తుంది. ఓటీపీ (OTP)   కోడ్ తప్పనిసరిగా  చెబితేనే డెలివరీ ఇస్తారు, లేదంటే సిలిండర్ వెనక్కి వెళ్తుంది.
*ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్లీ మరొకటి బుక్ చేయాలంటే పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గడువు (లాక్-ఇన్ పీరియడ్) నిబంధన అలాగే అమల్లో ఉంది.