మీ ఫ్లాట్కు మాదీ పూచీ! హైదరాబాద్లో పెరుగుతున్న ‘హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్స్’ సర్వీసెస్

మీ ఫ్లాట్కు మాదీ పూచీ! హైదరాబాద్లో పెరుగుతున్న ‘హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్స్’ సర్వీసెస్
  • కొనబోయే ఫ్లాట్, విల్లాలో క్వాలిటీ చెక్ చేసేందుకు స్పెషల్​ ఇంజనీర్లు
  • ఫ్లోర్, వాల్స్, డోర్స్ నుంచి ప్లంబింగ్, కరెంట్ దాకా అన్నీ తనిఖీ చేసి రిపోర్ట్​
  • దానిని బట్టి కొనాలో, వద్దో నిర్ణయం తీసుకునే చాన్స్​
  • రూ.20 వేల లోపే ఫీజులు.. కొనుగోలుదారులకు లక్షల్లో ఆదా

హైదరాబాద్​, వెలుగు: ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మెగా హైదరాబాద్​ సిటీలో మంచి ఫ్లాట్​ కొనుక్కొని హాయిగా జీవించాలని ఎవరికి ఉండదు? ఇందుకోసం లక్షలు, కోట్లలో బ్యాంకు లోన్​తీసుకొని 20, 30 ఏండ్లపాటు ఈఎంఐలు కట్టడానికి సైతం ఉద్యోగులు, వ్యాపారులు రెడీ అవుతారు. ఇలా తమ జీవితకాలపు శ్రమను పెట్టుబడిగా పెట్టి కొనుక్కునే ఫ్లాట్​ఒకవేళ నాసిరకంగా ఉంటే అంతాబూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

అలాగని వాల్స్​ నుంచి డోర్స్ దాకా, కరెంట్​ నుంచి ప్లంబింగ్ దాకా బిల్డింగ్​ కన్​స్ట్రక్షన్​, ఇన్​ఫ్రా క్వాలిటీ ఎలా ఉందో సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. చాలా మందికి ఫ్లాట్​ కొనడమే తప్ప బిల్డర్​తో చేసుకున్న అగ్రిమెంట్​లో ఏమున్నది? ఒప్పందం ప్రకారం బిల్డర్​ ఫ్లాట్​ను నిర్మించి అప్పగిస్తున్నారా.. లేదా? అనే విషయాలు తెలియవు.

తీరా ఇంట్లో చేరాక తాము మోసపోయినట్టు తెలుసుకొని లబోదిబోమనడం కామన్​గా మారింది. కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్లలో  ఏడాది తిరక్కముందే రిపేర్ల కోసం మళ్లీ రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి మోసాలకు చెక్​ పెట్టడానికి మెగా హైదరాబాద్​ సిటీలో ఇటీవలికాలంలో ‘హ్యాండోవర్​ ఎక్స్ పర్ట్స్​ సర్వీసెస్​’ పెరిగాయి. ఫ్లాట్​ నిర్మాణ దశ నుంచే క్వాలిటీ చెక్​ చేసే ఇంజినీర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చారు. ఫ్లాట్​లో అగ్రిమెంట్​ ప్రకారం..  ఫ్లోర్, వాల్స్, డోర్స్, కరెంట్, ప్లంబింగ్ తదితర నిర్మాణాలు, వస్తుసామగ్రి  క్వాలిటీ చెక్ చేసి  బిల్డర్ల పనితీరుపై పక్కా రిపోర్ట్​ చేతిలో పెడ్తున్నారు.

క్వాలిటీ చెక్ ​చేయకుంటే అంతే.. 
మెగా హైదరాబాద్​ సిటీలో  ఏటా రూ.50 వేల కోట్లకు పైగా రియల్​ ఎస్టేట్​ వ్యాపారం జరుగుతోంది. ఐటీ, ఫార్మా హబ్​కావడంతో ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. హై రైజ్డ్​ బిల్డింగ్​ లేదా లగ్జరీ విల్లా కొనుగోలు కోసం  బిల్డర్​తో ఒప్పందం చేసుకుంటే బుకింగ్​మొదలుకొని గృహ ప్రవేశం నాటికి విడతలవారీగా పేమెంట్​ చేయాల్సి ఉంటుంది.

అగ్రిమెంట్​ సమయంలో ఫ్లాట్,  విల్లా నిర్మాణానికి సంబంధించి ఫ్లోర్, వాల్స్, ప్లంబింగ్​లాంటి సివిల్​ వర్క్ కోసం ఎలాంటి ఇటుక, సిమెంట్, స్టీల్ తదితర మెటీరియల్​ వాడాలి?  డోర్స్, ఇతర వుడ్​వర్క్​ క్వాలిటీ ఎలా ఉండాలి? వంటి విషయాలు అగ్రిమెంట్​లో పొందుపరుస్తారు. కానీ, చాలా మంది కొనుగోలుదారులకు నిర్మాణ సమయంలో క్వాలిటీ చెక్​ చేసే పరిస్థితి ఉండదు.

ఇక పూర్తయిన అపార్ట్​మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసేవారికి అందులో వాడిన మెటీరియల్​క్వాలిటీ ఎలా ఉందో తెలిసే అవకాశం లేదు. ఈ రెండు కేసుల్లోనూ ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన నెలల వ్యవధిలోనే క్వాలిటీ లోపాలు బయటపడ్తున్నాయి. బిల్డర్​ నాసిరకమైన ఇటుక, ఇసుక, సిమెంట్​వాడడం వల్ల ఏడాది తిరిగేలోపలే గోడలు, స్లాబు నెర్రలుబారుతున్నాయి. పగుళ్లలోంచి నీళ్లు కారుతుంటాయి. 

స్లాబులు ఉరవడం వల్ల లక్షలు పెట్టి చేయించే ఇంటీరియర్​డెకరేషన్​, వుడ్​వర్క్​ దెబ్బతింటున్నది. అటు డోర్లు, కిటికీలకు క్వాలిటీ కర్ర వాడకపోవడం వల్ల పగుళ్లు పట్టడం, చెదపట్టడం కామన్​గా మారింది.  ఫలితంగా కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్లకు ఏడాదితిరిగే లోపలే లక్షలు పెట్టి రిపేర్లు చేయించాల్సి వస్తోంది.

అన్ని కోణాల్లో పరిశీలించాకే కొనుగోలుదారుకు రిపోర్ట్.. 
మనం కొనుగోలు చేయబోయే ఫ్లాట్, విల్లా క్వాలిటీ ఎలా ఉంది? ఒప్పందం ప్రకారం బిల్డర్​సరైన మెటీరియల్​వాడారా? లేదా?  చెక్​ చేయడానికి కొత్తగా ‘హ్యాండోవర్​ ఎక్స్​ పర్ట్స్’​ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ​సర్వీసెస్​ను సంప్రదించగానే కన్​స్ట్రక్షన్​ఇంజినీర్స్​రంగంలోకి దిగుతారు.

ముందుగానే అగ్రిమెంట్​చేసుకుంటే ఆ డాక్యుమెంట్స్​ ప్రకారం, లేదంటే మన అంచనాలకు అనుగుణంగా ఆయా నిర్మాణాలు ఉన్నాయా? లేదా? ప్రత్యేక యంత్రాల ద్వారా చెక్​చేస్తారు. ఫ్లాట్/విల్లా ఏరియాను కొలవడంతో వీరి పని మొదలవుతుంది.

మనకు చెప్తున్నట్టుగా ఫ్లాట్​/విల్లా ఏరియా ఉందా? లేదా? చెక్​చేస్తారు. గజం తేడా వచ్చినా రూ.లక్షల్లో ఓనర్​కు మిగిలినట్లే. కొందరు బిల్డర్లు గోడలు, సీలింగ్‌‌‌‌లలో, డోర్లలో వచ్చే పగుళ్లను పెయింట్​తో కవర్​చేస్తారు. ఈ ఎక్స్​పర్ట్స్​ ప్రత్యేక పరికరాల ద్వారా క్రాక్​లను గుర్తిస్తారు. వాటి సైజు ఎలా ఉంది? భవిష్యత్​లో పెరుగుతాయా? అలాగే ఉంటాయా? చెక్​చేసి చెప్తారు.  ఇంటి పై భాగంలో వాటర్‌‌‌‌ ప్రూఫింగ్, బాత్‌‌‌‌రూమ్ వాల్స్, కిచెన్ సింక్ ఏరియా​ఎలా ఉంది? ఏదైనా లీకేజీ ఉందా? అనే విషయంలోనూ ఫోకస్​పెడ్తారు.

కరెంట్​కు సంబంధించి కేబుల్స్, ఎలక్ట్రికల్ ప్యానల్స్,  ఎర్తింగ్, ఎంసీబీ సరిగ్గా ఉన్నాయా? లేదా? చూస్తారు. ప్లంబింగ్​ విషయంలో ప్రతి నల్లా, షవర్, ఫ్లష్, వాటర్ ప్రెజర్, డ్రైనేజ్ స్పీడ్ పరిశీలిస్తారు. పైపుల లీకేజీలు, ఓవర్‌‌‌‌హెడ్, అండర్‌‌‌‌ గ్రౌండ్ ట్యాంకుల నిర్మాణం, వాటి కెపాసిటీ చెక్​ చేస్తారు.  ఇంట్లోకి వెంటిలేషన్​ సరిగ్గా ఉందా? లేదా గమనిస్తారు. డోర్లు, కిటికీలకు ఉపయోగించిన కలప, సేఫ్టీ గ్రిల్స్​ పరిశీలిస్తారు. లిఫ్ట్, మెట్లు, అగ్ని ప్రమాదం సంభవిస్తే  ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌‌‌‌మెంట్ ఉందా? లేదా? చూస్తారు.

అలాగే ఓనర్లకు కేటాయించిన టూ వీలర్, కార్ పార్కింగ్ అలాట్‌‌‌‌మెంట్, వర్షపు నీటిని భూమిలోకి పంపించే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్.. ఇలా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి కొనుగోలుదారుకు పక్కా రిపోర్ట్​ అందిస్తున్నారు.

ఇందుకు సాక్ష్యంగా అవసరమైన ఫొటోలు, వీడియోలను తీసి  పంపిస్తున్నారు. వీరి నివేదిక ఆధారంగా ఆ ఫ్లాట్​ను, విల్లాను కొనుగోలు చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటున్నారు. అలాగే, ముందే అగ్రిమెంట్​చేసుకున్నవారైతే  బిల్డర్  లోపాలను సరిచేసి ఇస్తేనే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారు.  

రూ.20 వేల లోపే ఫీజు
ఈ తరహా ‘హ్యాండోవర్​ ఎక్స్ పర్ట్స్​ సర్వీసెస్​’ మెగా హైదరాబాద్​ సిటీలో పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. ఫ్లాట్, విల్లా విస్తీర్ణాన్ని బట్టి ఒక రోజు ఇన్​స్పెక్షన్​ కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చార్జ్​ చేస్తున్నారు. ఈ కంపెనీల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫైడ్​ సివిల్​ఇంజినీర్లే ఉంటారు. 

వెబ్​సైట్లు, వాట్సప్, ఫేస్​బుక్, ఇన్​స్ట్రా గ్రామ్​ తదితర సోషల్​ మీడియా ఫ్లాట్​ ఫామ్​ల ద్వారా తమ సర్వీస్​వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ‘ఒక్క ఫోన్​ కొడితే చాలు.. మీ ఫ్లాట్​కు మాదీ పూచీ!’ అంటూ కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే ఈ విధమైన సర్వీస్​లు విదేశాల్లో పాపులర్​ కాగా.. ముంబై, బెంగళూరు వంటి మెగా సిటీల్లో కొంతకాలంగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు మెగా హైదరాబాద్​లో ఈ విధమైన సర్వీసులు అందుబాటులోకి రావడం కొనుగోలుదారులకు  వరంగా మారిందని రియల్​ఎస్టేట్​రంగ నిపుణులు చెబుతున్నారు.