కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో వానరాల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా తిరుమలలోని ప్రసిద్ధ జపాలి తీర్థంలో కోతుల దాడులు తీవ్ర కలకలం రేపాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లిన ఐదుగురు భక్తుల బృందంపై వానరాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భక్తులను వెంటనే అప్రమత్తమై తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
జపాలి హనుమాన్ తీర్థం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో.. ఇక్కడ వానరాల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆలయం ఎదుట భక్తులు సమర్పించే కొబ్బరికాయలను దక్కించుకోవడానికి కోతులు గుంపులుగా వచ్చి భక్తులపై దాడులకు తెగబడుతున్నాయి. దీంతో భక్తులు భయాందోళనలతో వణికిపోతున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ, టీటీడీ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, కొందరు సోషల్ మీడియాలో రీల్స్ కోసం, వైరల్ కావాలనే దురాశతో కొందరు భక్తులు వానరాలకు దగ్గరగా వెళ్లి తినుబండారాలు తినిపిస్తూ ప్రమాదకరమైన వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల కోతులు మరింత దూకుడుగా మారుతున్నాయని, తక్షణమే ఇలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
►ALSO READ | సీఐ నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. జులై 28 నుంచి సిట్ కస్టడీలోకి
