రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు

రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్:  రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది.. రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయం సమీపంలో అతి వేగంతో దూసుకొచ్చిన ఒక స్కోడా ర్యాపిడ్ కారు.. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారును అడ్డుకుని డ్రైవర్‌ను పట్టుకున్నారు. కారు డ్రైవర్ విపరీతంగా మద్యం తాగి ఉన్నాడు. ఎంతలా అంటే.. కనీసం నిలబడే పరిస్థితిలో కూడా లేకపోవడంతో, తన పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. ఇక కారులో ఉన్న ఓ యువతి మాత్రం ఏ విషయాన్నీ చెప్పడానికి నిరాకరించి అనుమానాలకు తావిచ్చింది.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణ సమయంలో ఆ డ్రైవర్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నానా తంటాలు పడినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.