జెన్ Zలా వీళ్లు మీమ్స్ చేయలేరు.. మిలీనియల్స్ E20పెట్రోల్ బాధను ప్రభుత్వం వింటుందా?

జెన్ Zలా  వీళ్లు  మీమ్స్ చేయలేరు.. మిలీనియల్స్ E20పెట్రోల్  బాధను ప్రభుత్వం వింటుందా?
  • ఇథనాల్ పెట్రోల్ తో నష్టం లేదంటుంది ప్రభుత్వం..
  • మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయంటున్నారు వాహనదారులు 
  • భారీ ఎత్తున ఆందోళనకు సిద్దమవుతున్న మిలీనియల్స్ 
  • జెన్ జెడ్ లాగా మిలీనియల్స్ బాధను ప్రభుత్వం వింటుందా?

E20 పెట్రోల్‌ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తొలిసారిగా ధర్నాలు కూడా జరిగాయి. వాహనదారులహక్కులు, పెరుగుతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేసేందుకు ట్రాన్స్ పోర్టు, వాహనదారుల హక్కుల సంఘాలు పోరాటానికి సిద్దమవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో భారీ వాహన ర్యాలీ, పార్లమెంట్ ముట్టడికి రంగం సిద్దం చేస్తున్నాయి.  అంతేకాదు E20 పెట్రోల్ సమస్య సగటు బడుగు జీవి సమస్య. వీళ్లు జెన్ జెడ్‌లా మీమ్స్ చేయలేరు.. మిలీనియల్స్ E20పెట్రోల్  బాధను ప్రభుత్వం వింటుందా? E20 పెట్రోల్ పై కేంద్ర వ్యతిరేకంగా ఆందోళనలకు కేంద్రం స్పందిస్తుందా?  అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
ఆగస్టు 4, 2026 న పార్లమెంట్ ముట్టడికి ట్యాక్సీ, టూరిస్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు పిలుపునిచ్చారు. వీరితోపాటు వాహనదారులు ఎంపిక హక్కులకోసం 'టీమ్ భారత్' సంస్థ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. జూలై 31న ఢిల్లీలో 'గాడీ మార్చ్, గాంధీ మార్చ్' పేరుతో భారీ శాంతియుత వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పార్లమెంట్ స్ట్రీట్ వరకు సాగనుంది. 

ఇథనాల్ పెట్రోల్ (E20)పై కేంద్రం ఏమంటోందంటే..

భారత్‌లో చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, రైతులకు ఆదాయం పెంచాలనే లక్ష్యంతో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి (E20) కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ నిర్ణయం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడం, చెరకు వంటి పంటలకు డిమాండ్ పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.

అయితే సాధారణ వాహనదారుల ఆందోళన మాత్రం వేరేలా ఉంది. ముఖ్యంగా 2023కు ముందు తయారైన బైక్‌లు, కార్లు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా తయారు చేయలేదు. దీంతో మైలేజీ తగ్గుతోందని, ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతోందని చాలామంది వాహన యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. కొంతకాలం తర్వాత ఇంజిన్‌లోని రబ్బరు భాగాలు, పైపులు దెబ్బతినే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు కూడా సూచిస్తున్నారు.

ఇక్కడ ప్రధాన సమస్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు.. ప్రజలకు సరైన వివరణ ఇవ్వకపోవడమే. దేశ ప్రయోజనాల కోసం ఇథనాల్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంటే, పాత వాహనాల యజమానులు ఎదుర్కొనే ఇబ్బందులను కూడా ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించి, వారికి ప్రత్యామ్నాయాలు చూపించాల్సిన బాధ్యత ఉంది.

నిపుణులు మూడు ముఖ్యమైన సూచనలు చేస్తు్న్నారు. మొదటగా ప్రస్తుతం E20 వద్దే కొనసాగించి, మరింత అధిక మిశ్రమాలపై తొందరపడకూడదంటున్నారు. రెండోది..పాత వాహనాల కోసం E10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచి, వినియోగదారుడికి ఎంపిక అవకాశం ఇవ్వాలి అంటున్నారు. మూడోది భవిష్యత్తులో కొత్త ఇంధన విధానాలను అమలు చేసే ముందు మార్కెట్‌లో ఉన్న వాహనాల సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలించాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. 

దేశ ఇంధన భద్రత కోసం ఇథనాల్ కార్యక్రమం అవసరమే. కానీ ప్రజల అనుభవాలను పట్టించుకోకుండా గణాంకాలతో మాత్రమే సమాధానం చెప్పడం సరైన విధానం కాదు. ప్రభుత్వ విధానాలు విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసం కూడా అంతే ముఖ్యమైనది. అభివృద్ధి లక్ష్యాలు ఎంత గొప్పవైనా, వాటి ప్రభావం సామాన్యుడిపై ఎలా ఉంటుందో కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే ఇంధన భద్రతతో పాటు ప్రజల నమ్మకాన్ని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోగలదని నిపుణులు సలహా ఇస్తున్నారు.