- టార్గెట్ 76 వేల మంది.. ఇప్పటివరకు అయింది 79 మందికే
- ఈ ప్రక్రియ పూర్తికాకపోతే ఈ–మస్టర్లు, ఫేస్ అథెంటికేషన్ పడదు
- ఫలితంగా నిలిచిపోనున్న వేతనాలు
- రేపటి నుంచే నూతన విధానం అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (వీబీ– జీ రామ్ జీ) పనిచేసే స్కిల్డ్, సెమీ-స్కిల్డ్ కార్మికులకు ఇకపై వేతనం పొందాలంటే కేంద్రప్రభుత్వం ఈ– -కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ నిబంధన ప్రకారం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయితేనే ఈ-మస్టర్‌లో పేరు నమోదై, పని ప్రదేశంలో హాజరు పడుతుంది. ఆ తర్వాత పనుల కొలతల అనంతరం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయి. ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సోమవారం నుంచే అమల్లోకి తెస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో దీని అమలుపై అస్పష్టత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 76,659 మంది స్కిల్డ్ లేబర్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 79 మందికి మాత్రమే ఈ-కేవైసీ పూర్తయింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని సగానికి పైగా అంటే 16 జిల్లాల్లో ఒక్కరికి కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోవడంతోపాటు, తాము చేసిన పనికి వేతనాలు రావేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ–కేవైసీ లేకుంటే ఏమవుతుంది..?
కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన నూతన నిబంధనల ప్రకారం వేతన ప్రక్రియ అంతా పూర్తిగా డిజిటల్ వ్యవస్థతో ముడిపడి ఉంది. ప్రోగ్రామ్ ఆఫీసర్ లాగిన్‌లో ఈ–మస్టర్ జనరేట్ కావాలంటే కూలీకి ఈ–కేవైసీ తప్పనిసరి. ఒకవేళ కేవైసీ లేకపోతే సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా వారి పేర్లను తిరస్కరిస్తుంది. పని ప్రదేశంలో మేట్లు తమ మొబైల్‌లోని ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల ఫేస్ అథెంటికేషన్ చేసి హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే, ముందస్తుగా ఈ–కేవైసీ పూర్తి కాకపోతే ఈ యాప్ హాజరును అంగీకరించదు. ఇలా పడిన హాజరు ఆధారంగానే టెక్నికల్ అసిస్టెంట్లు మూడు రోజుల్లోగా పనుల కొలతలు రికార్డు చేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌టీవోలు జనరేట్ అయి ఐఎఫ్‌ఎంఐఎస్, పీఎఫ్‌ఎంఎస్, ఆర్‌బీఐల ద్వారా నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోకి వేతనం జమవుతుంది. అయితే, ఈ వ్యవస్థలో మొదటి దశ అయిన ఈ–కేవైసీ ప్రక్రియే పూర్తికాకపోతే, వేతన బిల్లులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది.
16 జిల్లాల్లో ఒక్కరికీ కాలేదు..
రాష్ట్రంలో మొత్తం 76,659 మంది స్కిల్డ్, సెమీ–స్కిల్డ్ కూలీలు ఉండగా, వారిలో 46,707 మందికి మాత్రమే ఆధార్ వివరాలు అనుసంధానమయ్యాయి. అయితే, యూఐడీఏఐ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా పూర్తి చేయాల్సిన ఫేస్ అథెంటికేషన్ ఈ–కేవైసీ ప్రక్రియలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఏకంగా 16 జిల్లాల్లో ఒక్క కూలీకి కూడా ఇప్పటివరకు ఈ–కేవైసీ పూర్తి కాలేదు. జిల్లాల వారీగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెంలో 3,435 మంది, వరంగల్‌లో 3,332, కరీంనగర్‌లో 2,587, కామారెడ్డిలో 2,379, నాగర్‌కర్నూల్‌లో 1,860, సంగారెడ్డిలో 1,758, యాదాద్రి భువనగిరిలో 1,343, నిర్మల్‌లో 1,182, రంగారెడ్డిలో 1,153, హనుమకొండలో 1,148, జనగామలో 1,004, వనపర్తిలో 847, జయశంకర్ భూపాలపల్లిలో 743, గద్వాలలో 565, ములుగులో 524 మంది చొప్పున కూలీలకు ఈ కేవైసీ పూర్తి చేయలేదు. అలాగే వికారాబాద్‌లో 6,121 మందికి ముగ్గురు, ఆదిలాబాద్‌లో 6,033 మందికి ఒకరు, నిజామాబాద్‌లో 5,995 మందికి ఐదుగురు, నల్గొండలో 6,832 మందికి ఒక్కరికే ఈ–కేవైసీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా జగిత్యాల జిల్లాలో కేవలం 37 మందికి మాత్రమే ఇది నమోదైంది.
పనులూ పూర్తికావు.. హాజరూ పడదు
ఈ–కేవైసీ వైఫల్యానికి తోడు రాష్ట్రంలో ఉపాధి పనుల అమలులోనూ తీవ్రంగా వెనుకబడింది. ప్రతి గ్రామ పంచాయతీలో రోజూ కనీసం 60 మంది పనులకు రావాలన్నది లక్ష్యం కాగా, రాష్ట్ర సగటు మాత్రం కేవలం 17 మందికే పరిమితమైంది. ప్రస్తుతం వికారాబాద్‌లో 11 మంది, ఆసిఫాబాద్‌లో 12 మంది మాత్రమే వస్తున్నారు. నిబంధనల ప్రకారం రోజుకు 7.65 లక్షల మందికి పని కల్పించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో వస్తున్నది కేవలం 2.18 లక్షల మందే. మరోవైపు పనులు చేపట్టి ఏళ్ల తరబడి ముగించకుండా రికార్డుల్లో పెండింగ్‌లో పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఏకంగా 5,86,126 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలంటే పనుల జియో ట్యాగింగ్ తప్పనిసరి. కానీ రాష్ట్రంలో ఇంకా 2,33,321 పనులకు జియో ట్యాగింగ్ చేయకుండా అటకెక్కించారు. గడువు సమీపించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ–కేవైసీపై కనీస కసరత్తు చేయకపోవడంపై ఉన్నతాధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్ కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తున్నందున, పాత డేటాను వెంటనే క్లియర్ చేసి, యుద్ధప్రాతిపదికన ఈ–కేవైసీ పూర్తి చేయాలని డీఆర్‌డీవోలు, ఎంపీడీవోలను వారు ఆదేశించారు.
