ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం.. పాస్టర్ రివ్యూ పిటిషన్ కొట్టివేత !

ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం.. పాస్టర్ రివ్యూ పిటిషన్ కొట్టివేత !

ఢిల్లీ: ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీకి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయ స్థానం సమర్థించింది. జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్పై విచారణ జరిపింది.

రివ్యూ పిటిషన్లో పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని.. తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం కనిపించలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ హోదాపై మార్చి 24, 2026 నాటి సుప్రీం కోర్టు తీర్పును కూడా చూశామని, రికార్డులో ఎటువంటి లోపం కనిపించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా క్రైస్తవ మతంలోకి లేదా మరే ఇతర మతంలోకి మారిన వ్యక్తి తక్షణమే షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతాడని మార్చి 2026లో సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. మూడు అంశాలను నిరూపించుకున్నట్లయితే అటువంటి వ్యక్తి షెడ్యూల్డ్ కుల హోదాను తిరిగి పొందవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవేంటంటే..

  • ఆ వ్యక్తి తాను షెడ్యూల్డ్ కులంగా గుర్తించబడిన కులంలో పుట్టానని నిరూపించుకోవాలి.
  • వారు హిందూ మతం, సిక్కు మతం లేదా బౌద్ధ మతంలోకి నిజమైన పునఃమత మార్పిడిని, గతంలో స్వీకరించిన మతాన్ని పూర్తిగా త్యజించడాన్ని నిరూపించుకోవాలి.
  • తమ అసలు కులానికి చెందిన సభ్యులు తమను తిరిగి స్వీకరించారని వారు నిరూపించుకోవాలి.

ఈ షరతులలో ఒక్కదాన్ని నిరూపించడంలో విఫలమైనా దావా నిలవదని కోర్టు స్పష్టం చేసింది.

పాస్టర్ చింతాడ ఆనంద్ కేసు పూర్వాపరాలు ఏంటంటే..
ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని కొత్తపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ 2021 జనవరి 24న ప్రార్థనలకు వెళ్లారు. అయితే.. ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళుతుండగా తనను కులం పేరుతో దూషించారని, తనపై దాడి చేశారని చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో పాస్టర్ చింతాడ ఆనంద్ ఫిర్యాదుతో.. కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే.. అక్కల రామిరెడ్డి ఈ కేసుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పాస్టర్‌ ఆనంద్‌ తన ఫిర్యాదులోనే స్వయంగా తాను క్రైస్తవుడినని పేర్కొన్నాడని, మతం మారితే అట్రాసిటీ చట్టం వర్తించదని న్యాయ పోరాటం చేశారు.

అలాంటప్పుడు ఎస్సీ కాని పాస్టర్ చింతాడ ఆనంద్ ఫిర్యాదుతో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా నమోదు చేస్తారని అక్కల రామిరెడ్డి వాదించారు. ఈ కేసులో విచారణ సమయంలో.. షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులు మతం మారిన మరు క్షణమే ఎస్సీ హోదా కోల్పోతారని 2025 ఏప్రిల్‌ 30న ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే.. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పాస్టర్ ఆనంద్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను డిస్మిస్ చేసింది.