మోడల్ పంచాయతీలపై నిఘా..ఓడీఎఫ్ హోదా కాపాడడమే లక్ష్యంగా కేంద్రం ప్లాన్

మోడల్ పంచాయతీలపై నిఘా..ఓడీఎఫ్  హోదా కాపాడడమే లక్ష్యంగా కేంద్రం ప్లాన్
  • పల్లెల్లో పారిశుధ్యం, చెత్త వాహనాలు, తడి, పొడి, 
  • ద్రవ వ్యర్థాలు, మరుగుదొడ్ల నిర్వహణపై పర్యవేక్షణ
  • వీటి ఆధారంగానే నిధులు, లోపాలున్న గ్రామాల్లో స్పెషల్  యాక్షన్  ప్లాన్ 
  • ఓడీఎఫ్  ప్లస్  మోడల్  పంచాయతీలకే స్వచ్ఛ సేవా ఆంకలన్  పరీక్ష

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని పల్లెల్లో పారిశుధ్య నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. స్వచ్ఛ భారత్  మిషన్(ఫేజ్-2)లో భాగంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్  ప్లస్) హోదా సాధించిన మోడల్  పంచాయతీల పనితీరును అంచనా వేసేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ స్వచ్ఛ సేవా ఆంకలన్  పేరిట డిజిటల్  పరిశీలనను అమల్లోకి తెచ్చింది. 

పల్లెల్లో లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్ది, ఓడీఎఫ్  హోదాను కాపాడడమే లక్ష్యంగా ఈ ప్లాన్  రూపొందించింది. ఈ సర్వే అన్ని పంచాయతీలకు కాకుండా, అధికారికంగా ఓడీఎఫ్  ప్లస్  మోడల్  గుర్తింపు పొందిన గ్రామాలకే పరిమితం చేశారు. 

ఆయా పంచాయతీల్లో గ్రౌండ్‌‌‌‌  లెవల్‌‌‌‌లో పరిశుభ్రత అమలవుతోందా? కేవలం ప్రకటనలకే పరిమితమైందా?  అన్నది తేల్చడమే దీని ప్రధాన ఉద్దేశం. గ్రామ నీటి, పారిశుధ్య కమిటీ మొదలుకొని జిల్లా పరిషత్  సీఈవోలు, రాష్ట్ర స్థాయి పారిశుధ్య మిషన్  వరకు అందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. అంతేకాదు, ఏదైనా గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో లోపాలున్నట్లు గురిస్తే స్పెషల్​ యాక్షన్​ ప్లాన్​ అమలు చేయనున్నారు. 

ఆ పల్లెలకు మాత్రమే ఛాన్స్..

స్వచ్ఛ సేవా ఆంకలన్  ప్రక్రియలో అన్ని పంచాయతీలకు కాకుండా ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా నిలిచి అధికారికంగా ఓడీఎఫ్  ప్లస్  గుర్తింపు పొందిన పంచాయతీలను మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియలో గ్రామ నీటి, పారిశుధ్య కమిటీ మొదలుకొని జిల్లా పరిషత్  సీఈవోలు, జిల్లా, రాష్ట్ర స్థాయి పారిశుధ్య మిషన్ల వరకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ బాధ్యతలను ఖరారు చేశారు.

 అయితే, గ్రామాల్లో పారిశుధ్య సేవల పనితీరును నిర్ధారించేందుకు కేంద్రం ఐదు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది.  ఓడీఎఫ్  హోదాను నిరంతరం నిలబెట్టుకోవడంతోపాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను అమలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. వీటితోపాటు గ్రామంలో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచడం, చెత్త సేకరణ వాహనాలు, సెగ్రిగేషన్  షెడ్ల వంటి పారిశుధ్య ఆస్తుల నిర్వహణ, మరమ్మతులు సక్రమంగా సాగుతున్నాయా? లేదా? అని పరిశీలించనున్నారు.

 సామూహిక మరుగుదొడ్లు వినియోగం ఎలా ఉంది? శుభ్రంగా ఉన్నాయో? లేదో చూసి మార్కులు కేటాయించనున్నారు. ఈ అంశాల్లో సాధించిన మార్కుల ఆధారంగానే భవిష్యత్తులో పల్లెలకు నిధుల కేటాయించే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ పర్యవేక్షణ ప్రక్రియలో తప్పుడు లెక్కలకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టనున్నారు. 

ముందుగా గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీ, పంచాయతీ పాలకవర్గం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను గ్రామసభ ముందుంచుతారు. ప్రజల ఆమోదం పొందిన తర్వాతే తుది తీర్మానం చేస్తారు. గ్రామసభ ఆమోదించిన నివేదికను పంచాయతీ కార్యదర్శి ఈ–గ్రామస్వరాజ్  పోర్టల్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేస్తారు.

లోపాలుంటే స్పెషల్  ప్లాన్

కార్యదర్శులు అప్‌‌‌‌లోడ్  చేసిన వివరాలను జడ్పీ సీఈవో, ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. ఎక్కడైనా పారిశుధ్య వ్యవస్థ మొరాయించినా, లోపాలు ఉన్నట్లు తేలినా.. వెంటనే అధికారులు డిస్ట్రిక్ట్  ట్రిగ్గర్  ఫారం ద్వారా ఆ సమస్యలను, కారణాలను రికార్డు చేస్తారు. అనంతరం జిల్లా నీటి, పారిశుధ్య మిషన్  ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్  ఇంప్రూవ్‌‌‌‌మెంట్  ప్లాన్  తయారుచేసి సమస్యలను పరిష్కరిస్తారు. రాష్ట్ర స్థాయి మిషన్(ఎస్‌‌‌‌డబ్ల్యూఎస్ఎం) ఎప్పటికప్పుడు ఈ నివేదికలను పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించనుంది.