హైదరాబాద్, వెలుగు: వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు ‘రాణి రుద్రమదేవి’ పేరు పెట్టాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి నిదర్శనమైన రుద్రమదేవి పేరు మామునూరు ఎయిర్‌పోర్టుకు పెట్టడం అత్యంత సముచితమని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయ పునరుద్ధరణ, భూసేకరణ, అనుమతుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
ఈ విషయాన్ని విస్మరించి, అంతా తానే చేశానని ప్రచారం చేసుకోవడం తగదని హితవు పలికారు. ఉమ్మడి వరంగల్ ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ నేతృత్వంలో తాము ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు నిబంధనల సమస్యను అధిగమించేందుకు ఎంతో శ్రమించామని లేఖలో తెలిపారు. ప్రస్తుత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పనులను ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని తాము కాదనడం లేదని, గత ప్రభుత్వం చేసిన కృషిని పూర్తిగా పక్కనపెట్టి మాట్లాడడం రాజనీతి అనిపించుకోదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
