ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ అక్రమాలకు చెక్

ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ అక్రమాలకు చెక్
  • జీతాలు, పీఎఫ్, ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ చెల్లింపులపై ప్రతినెలా ఆడిట్​
  •     ఉద్యోగులకు శాలరీలు జమ చేశాకే.. ప్రభుత్వం ఫండ్స్​ ఇచ్చేలా రూల్స్​
  •     ఆధార్ కంపల్సరీతో ఇప్పటికే 24 వేల మంది ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల తొలగింపు
  •     రెండు చోట్లా పనిచేస్తున్న మరో 3 వేల మంది గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: అక్రమాలకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌గా మారిన ఔట్ సోర్సింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కఠిన నిబంధనలు విధించింది. ప్రధానంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం తప్పనిసరి చేసింది. ఇవి సక్రమంగా అమలయ్యేలా ప్రతి నెలా ఆడిట్​నిర్వహించనుంది. ప్రక్షాళనలో భాగంగా ఇటీవల ఔట్ సోర్సింగ్​ ఉద్యోగుల ఆధార్ వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్​ చేయాలని అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. 

ఈ ఒక్క ఆదేశంతో ఆధార్​ ఇవ్వలేక వివిధ శాఖల్లో కొనసాగుతున్న దాదాపు 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. వీరిని నకిలీ ఉద్యోగులుగా తేల్చిన అధికారులు.. ఇన్నాళ్లూ వీరి పేరుతో ఏజెన్సీలు ప్రతినెలా ప్రభుత్వం నుంచి శాలరీల రూపంలో పెద్దమొత్తంలో అక్రమంగా లబ్ధి పొందినట్టు నిర్ధారించారు. వీరు కాకుండా మరో 3 వేల మంది రెండు చోట్ల పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఒకే చోట శాలరీ జమ చేస్తామని చెప్పడంతో రెండో చోట పేర్లు తొలగించుకుంటున్నారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలు, నిధుల మళ్లింపును అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ‘ఆడిట్ కమిటీ’ని రంగంలోకి దించింది. ఏజెన్సీలే ముందుగా ఉద్యోగులకు వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐలను చెల్లించి డిజిటల్ సాక్ష్యాలు చూపిస్తేనే ప్రభుత్వం నుంచి ఆ మొత్తాలను ఏజెన్సీల ఖాతాల్లోకి జమ చేస్తామని స్పష్టం చేసింది.

ఆడిట్​ ప్రొఫార్మా అమలు తప్పనిసరి..

వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల నియామకాలు, ఏజెన్సీల చట్టబద్ధత, ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక ‘ఆడిట్ ప్రొఫార్మా’ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కార్మిక, ఉపాధి శాఖ మెమో జారీ చేసింది. ఔట్​సోర్సింగ్ ఏజెన్సీల జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు తనిఖీ ప్రక్రియ కొనసాగుతోంది.ఉద్యోగులకు ఏజెన్సీ సరిగా వేతనాలు చెల్లిస్తుందా లేదా అని తనిఖీ చేస్తారు. ప్రభుత్వం నుంచి ఏజెన్సీకి అందిన మొత్తం, సదరు ఏజెన్సీ ఉద్యోగులకు చెల్లించిన జీతాలు, ఈఎస్​ఐ, ఈపీఎఫ్​ ఖాతాల్లో జమ చేసిన నిధుల వ్యత్యాసాలను ప్రతి నెలా తనిఖీ చేయనున్నారు. ఏజెన్సీలు శాలరీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి (డీబీటీ) వేస్తున్నాయా లేదా అనే అంశాన్ని ఆడిట్ ప్రొఫార్మాలో పొందుపరిచారు. ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ, ఈపీఎఫ్, ప్రొఫెషనల్ టాక్స్, జీఎస్టీ రిటర్న్స్‌‌‌‌‌‌‌‌ను సదరు ఏజెన్సీలు ఏ నెల వరకు అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేశాయనే వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 

నెలకు రూ.21,000 వరకు వేతనం తీసుకుంటున్న ఉద్యోగుల్లో ఈఎస్ఐ పరిధిలోకి ఎంతమంది వస్తున్నారు, ఇంకా ఎంతమందికి ఆ సదుపాయం అందడం లేదు; అలాగే రూ.15,000 లోపు వేతనం పొందుతున్న వారిలో ఈపీఎఫ్​ కవరేజ్ ఉన్నవారు ఎంతమంది అనే లెక్కలు సేకరిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరు, చిరునామా, యజమాని పేరు, ఫోన్ నంబర్లతో పాటు ఏజెన్సీ బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ కోడ్ వివరాలను సేకరిస్తున్నారు. మూడో విభాగంలో ఏజెన్సీ బాధ్యతలు, వారికి చెల్లిస్తున్న కమిషన్ శాతం, వర్క్ ఆర్డర్ జారీ తేదీలు, ఒప్పంద కాలపరిమితి, లేబర్ లైసెన్స్ రెన్యూవల్ సమయ పరిమితులపై నివేదిక కోరారు.