నిజాయితీ, నిర్భయంగా పనిచేస్తున్నందుకే.. హైడ్రాపై భూమాఫియా దుష్ప్రచారం: కమీషనర్ రంగనాథ్

నిజాయితీ, నిర్భయంగా పనిచేస్తున్నందుకే.. హైడ్రాపై భూమాఫియా దుష్ప్రచారం: కమీషనర్ రంగనాథ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా కమిషనర్ గా పనిచేస్తున్నాని చెప్పారు. ఆక్రమణలకు గురైన లక్షల కోట్ల ప్రభుత్వభూములను హైడ్రా ద్వారా కాపాడాం.. బడా భూకబ్జాదారుల నుంచి వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసి ప్రభుత్వానికి అప్పగించాం..నిజాయితీగా, నిర్భయంగా పనిచేస్తున్నందుకే  హైడ్రాపై భూ మాఫియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను రక్షిస్తున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు లక్షా 50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా ద్వారా కాపాడామని వివరించారు. ఇప్పటివరకు 6 చెరువులను పూర్తిగా పునరుద్దరించినట్లు చెప్పారు.  మరో 20 చెరువుల పనులు కొనసాగుతున్నాయన్నాయని సోమవారం (జూలై27) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. 

లోతుకుంట భూవ్యవహారంలో 10వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నం జరిగిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అనుమతి లేకుండా హెరిటేజ్ రాళ్లను బ్లాస్టింగ్ చేసి వందల చెట్లను నరికేసి పర్యావరణానికి విఘాతం కలిగించారని అన్నారు. స్థానికులు, పర్యావరణ వేత్తలు,  Save the Rocks Society  సభ్యులు చేసిన పిర్యాదులో హైడ్రా చర్యలు చేపట్టిందన్నారు.  ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారే తనపై కోర్టు ధిక్కార కేసులు పెట్టారని ఆరోపించారు. 

ప్రస్తుతం తనపై 63 కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. బతుకమ్మ కుంట, లోతుకుంట, సింగరేణి ప్లాట్లు, సామాన్యుల భూములు కాపాడటమే తప్పు అయి పోయింది, అన్ని కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని , న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందన్నారు. గతంలో ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్దతతో చేశాను.. భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా 100 శాతం ఫలితాలు వచ్చేలా నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం  చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.