దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు.. తెలంగాణలో 7.6 శాతం, ఏపీలో 8.0 శాతం .. తమిళనాడు టాప్

దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు.. తెలంగాణలో 7.6 శాతం, ఏపీలో 8.0 శాతం .. తమిళనాడు టాప్
  • జాతీయ సగటును దాటేసిన తెలుగు రాష్ట్రాలు 
  • తెలంగాణలో 7.6 శాతం, ఏపీలో 8.0 శాతం 
  • 11.6 శాతంతో తమిళనాడు టాప్
  • దేశంలో ఒంటరిగా ఉండే పురుషుల కంటే మహిళల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ!

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-–2024’ లో వెల్లడైంది. విడాకులు, జీవిత భాగస్వామిని కోల్పోవడం (వితంతువులు) వంటి కారణాల వల్ల పురుషులతో పోలిస్తే మహిళలే అత్యధిక సంఖ్యలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అక్షరాస్యత, సామాజిక చైతన్యం ఎక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.

భర్త తోడు లేకుండా 5.4 శాతం మహిళలు..

దేశవ్యాప్తంగా భర్త తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల జాతీయ సగటు 5.4 శాతంగా నమోదవ్వగా, దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలు ఈ సగటును దాటి ఇంకా ముందుకు వెళ్లిపోయాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికంటే అత్యధికంగా తమిళనాడులో 11.6 శాతం మంది, కేరళలో10.4 శాతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 8.0 శాతం, తెలంగాణలో 7.6 శాతం మంది మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. దీనికి పూర్తి భిన్నంగా ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌‌‌‌లో ఈ సంఖ్య కేవలం 2 శాతంగానే ఉండడం గమనార్హం. దేశంలో ఒంటరిగా ఉంటున్న పురుషుల శాతం కేవలం 1.6 మాత్రమే కాగా, మహిళల సంఖ్య దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

భర్తల కంటే ఎక్కువ బతుకుతున్నరు..

ఈ అసాధారణ మార్పు వెనుక బలమైన జీవనశైలి కారణాలున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య రక్షణ మెరుగ్గా ఉండడం వల్ల మహిళల సగటు జీవితకాలం పురుషుల కంటే ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల వృద్ధాప్యంలో వారు తమ భర్తల కంటే ఎక్కువ కాలం జీవిస్తూ వితంతువులుగా మిగిలిపోతున్నారు. తెలంగాణలో ప్రతి వెయ్యి మంది జనాభాకు పురుషుల మరణాల రేటు 4.6 గా, కర్నాటకలో 4.5 గా ఉంది. ఇది జాతీయ సగటు 3.6 కంటే చాలా ఎక్కువ. 

మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛ కూడా కారణమే.. 

మరోవైపు పట్టణీకరణ పెరగడం, మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛ, విద్యాస్థాయి మెరుగవ్వడం వల్ల పాతకాలం నాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఐటీ, ఇతర రంగాల విస్తృతితో మహిళలు సొంతంగా సంపాదించుకునే స్థాయికి చేరడం వల్ల కుటుంబ విభేదాలు వచ్చినప్పుడు రాజీ పడకుండా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించేందుకు వెనుకాడటం లేదు. 

ఒంటరిగా ఉండటానికి రీజన్.. 

గ్రామాల్లో భర్తను కోల్పోయిన మహిళలు ఎక్కువగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. పురుషుల కంటే మహిళల సగటు జీవితకాలం ఎక్కువగా ఉండటం, భర్త చనిపోయాక మహిళలు రెండో పెళ్లికి మొగ్గు చూపకపోవడం దీనికి కారణం. పట్టణాలు, నగరాల్లో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవించే మహిళల శాతం పెరుగుతోంది. ఆర్థికస్వేచ్ఛ సాధించిన మహిళలు పట్టణాల్లో ఒంటరిగా ఉండేందుకు వెనుకాడటం లేదని నివేదిక స్పష్టం చేస్తోంది. 

సమాజానికి పెద్ద సవాల్..

ఈ మారుతున్న సామాజిక సమీకరణాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు, సమాజానికి పెద్ద సవాల్​గా మారనున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో  70 శాతానికి పైగా పని చేసే ప్రజలు ఉన్నారు. కానీ రానున్న రెండు మూడు దశాబ్దాల్లో ఈ జనాభా అంతా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతుంది. అప్పటికి తోడు లేని ఒంటరి మహిళల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి  కేవలం ఉపాధి కల్పనపైనే కాకుండా ఒంటరి మహిళల సామాజిక భద్రత, మానసిక ఆరోగ్యం, వృద్ధాప్య రక్షణ, పెన్షన్ విధానాలపై ప్రభుత్వాలు ఇప్పుడే ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.