ఒకప్పుడు చెరువులు, సరస్సుల్లో తెల్లవారుజామున నీటిమీద తేలియాడే ఫ్లెమింగోలు, చెట్ల కొమ్మలపై గూళ్లు కట్టుకునే సైబీరియన్ కొంగలు, గుంపులుగా విహరించే బాతు జాతులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసేవి. కెమెరాలు చేతబట్టిన ఫొటోగ్రాఫర్లు, బైనాక్యులర్లతో పక్షి వీక్షకులు ఈ అందాలను ఆస్వాదించేందుకు తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సందడి క్రమంగా కనుమరుగవుతోంది. చెరువులున్నా వలస పక్షుల జాడ దొరకట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య కనిపిస్తుండడంతో ఇది ప్రకృతి హెచ్చరికా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో మన రాష్ట్రంలో పరిస్థితులేంటో ఓసారి చూద్దాం.
తెలంగాణలోని అమీన్‌పూర్ చెరువు, కిష్టారెడ్డిపేట్ చెరువు, ఖమ్మం జిల్లా చింతపల్లి లోని దూబాలమ్మ చెరువు, పాలేరు జలాశయం, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, మిడ్ మానేర్ డ్యామ్, కిన్నెరసాని జలాశయం, శామీర్ పేట చెరువు, అనంతగిరి కొండలు, శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, పాఖాల సరస్సు, మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ చెరువు, జిల్లాలలోని పలు ప్రధాన జలాశయాలకు ఎక్కువగా వలస పక్షులు వస్తుండేవి.
మంజీర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఉస్మాన్‌సాగర్ సరస్సు, హిమాయత్‌సాగర్ మంచినీటి జలాశయాలు శీతాకాలంలో గ్రేటర్ ఫ్లెమింగోలు, పెలికాన్లు,పెయింటెడ్ స్టోర్క్‌లకు ఆతిథ్యం ఇస్తుండేవి. శీతాకాలం ప్రారంభంలోనే పెలికాన్లు, ఫ్లెమింగోలు, బాతు జాతులు, నీటి పక్షులు, ఇతర విదేశీ పక్షులు కనిపించేవి.
కానీ ఇప్పుడు పెరిగిన కాలుష్యం, పట్టణీకరణ, సహజ ఆవాసాల నాశనం వల్ల తెలంగాణలో విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల రాక 50 శాతం తగ్గింది.సైబీరియా, యూరప్, మంగోలియా దేశాల నుంచి ప్రతి ఏటా వచ్చే వలస పక్షుల పలు జాతులు అంతరించి పోతుండటంతో తెలంగాణలో విదేశీ పక్షుల సందడి తగ్గుతోందని, పక్షుల శాస్త్రవేత్తలు, హైదరాబాద్ బర్డ్ వాచర్స్ పరిశీలనలో వెల్లడైంది.
మారిన వాతావరణంతో...
మారుతున్న వాతావరణంతో విదేశీ పక్షుల వలసలు తగ్గుతున్నాయని పక్షి శాస్త్రవేత్త డాక్టర్ ఎలగందుల వెంకట్ చెప్పారు. వలస పక్షులు తమ ప్రయాణ మార్గాల్లో ఆహారం, నీరు, సురక్షితమైన ఆవాసాలపై ఆధారపడుతుంటాయని, చెరువుల్లో కాలుష్యం పెరగడం, నీటి వనరులు క్షీణించడం, చుట్టుపక్కల భవన నిర్మాణాలు పెరగడం వల్ల పక్షులకు జీవన పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి.
వలస మార్గాల్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు కూడా పక్షుల వలసల సంఖ్య తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా మారాయంటారాయన. ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఆహార లభ్యతలో తగ్గుదల కారణంగా కొన్ని జాతులు తమ వలస ప్రాంతాలను మార్చుకుంటున్నాయని వెంకట్ చెప్పారు.
పురుగుమందుల ప్రభావం
‘‘మన రాష్ట్రంలోని విదేశీ వలస పక్షుల నిలయాలకు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పురుగు మందుల వాడకం పెరగడం వల్ల ఈ ప్రభావం పక్షులపై పడుతోంది. వలస పక్షులు విహరిస్తున్న సరస్సులు, చెరువుల కబ్జాలతో కుచించుకుపోవడం, పెరిగిన వాతావరణ కాలుష్యం వల్ల విదేశీ వలస పక్షుల మనుగడకు ప్రమాదంగా మారింది.
దీంతో ఆఫ్రికా, యూరప్ దేశాల నుంచి వచ్చే పక్షుల వలస గణనీయంగా తగ్గిందని మా బర్డ్ వాచర్స్ పరిశీలనలో వెల్లడైంద’’ని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరికృష్ణ ఆడెపు చెప్పారు. 300 వలస పక్షుల జాతులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులుగా గుర్తించారు. వలస పక్షుల సంఖ్య తగ్గడం ఆందోళనకరమైన విషయమని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం ఎర్త్ కామన్స్ ఇన్‌స్టిట్యూట్ డీన్ పీటర్ పి. మర్రా తెలిపారు.
70 శాతం కొంగలు వెళ్లిపోయాయి..
ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామంలోని దూబాలమ్మ చెరువు దగ్గర చింతచెట్లపై గూడు కట్టే సైబేరియన్ కొంగలు70 శాతం తిరిగి వెళ్లిపోయాయని చింతపల్లి గ్రామ నాయకుడు ముత్యాల కృష్ణారావు చెప్పారు. పాలేరు, కడెం, పాఖాల జలాశయాల్లోని చేపలను తింటూ చెట్లపై ఆవాసం ఉండే ఈ కొంగల సంఖ్య నానాటికి తగ్గుతుందని ఆయన చెప్పారు.
కొంగలు వేసే రెట్టలు, అవి కిందకు వదిలే చేప ముక్కలతో దుర్వాసన వస్తోందని చింతపల్లిలో చింతచెట్లను నరకడం వల్ల కోతులు స్వైరవిహారం చేస్తూ కొంగల గుడ్లను కిందపడేయడం వల్ల వలస పక్షుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. వాటిలో ఎక్కువగా ప్రభావితమవుతున్న పక్షుల్లో గ్రేటర్ ఫ్లెమింగోలు, పెలికాన్లు, పెయింటెడ్ స్టోర్క్‌లు, బార్-హెడెడ్ గీస్, నార్తర్న్ పిన్‌టెయిల్స్, సైబీరియన్ కొంగలు, వివిధ నీటి పక్షులు.. ఇవే ఎక్కువగా ఉన్నాయి.
వలసలు తగ్గాయి
విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల సంఖ్య 50 శాతం తగ్గడం పట్ల హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ జనరల్ సెక్రటరీ రాజీవ్ ఖండేల్ వాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్, అమీన్‌పూర్, పోచారం, ఇతర చిత్తడి నేలల్లోని పక్షి వీక్షకుల పరిశీలనలో తెలంగాణకు వలస పక్షుల రాకలో 50 శాతం క్షీణతను గుర్తించామని ఆయన చెప్పారు. వేగవంతమైన పట్టణీకరణ, ఆక్రమణలు, చిత్తడి నేలలు, సరస్సులు ఎండిపోవడం వల్ల పక్షుల ఆవాసాలు, విరామ స్థలాలు, శీతాకాల విడిది ప్రదేశాలు తగ్గిపోయాయని రాజీవ్ ఖండేల్ వాల్ పేర్కొన్నారు.
పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, శబ్ద, కాంతి కాలుష్యం పక్షుల ఆహార, విశ్రాంతి స్థలాలకు ఆటంకం కలిగిస్తుందని చెప్పారు. జలాశయాల చుట్టూ పెరిగిన మానవ కార్యకలాపాల వల్ల, సాంప్రదాయకంగా సైబీరియా, మధ్య ఆసియా, యూరప్, మంగోలియా దేశాల నుంచి వచ్చే బార్-హెడెడ్ గీస్, నార్తర్న్ పిన్‌టెయిల్స్ వివిధ రకాల వాడర్స్ వంటి పక్షి జాతులు తెలంగాణకు దూరమవుతున్నాయని ఆయన తెలిపారు.
పక్షుల ఆవాసాలను పరిరక్షించాలి
విదేశాల నుంచి వలస వస్తున్న పక్షులు నివాసముంటున్న ఆవాసాలను పరిరక్షించాలని వాయిస్ ఆఫ్ నేచర్ ఫౌండర్ శివకుమార్ వర్మ కోరారు. పక్షులు వెట్ ల్యాండ్స్, సరస్సుల దగ్గర ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయని, అందువల్ల ఆయా వెట్ ల్యాండ్లు కనుమరుగు కాకుండా పరిరక్షించాలని ఆయన సూచించారు. ప్రతి సీజన్లో రెక్కలు విప్పి వేల కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణకు చేరుకునే వలస పక్షులు ప్రకృతి పంపే ప్రేమ సందేశం. ఆ సందేశం మసకబారకుండా ఉండాలంటే వాటి ఆవాసాలను, జలాశయాలను, జీవవైవిధ్యాన్ని సంరక్షించడం సమాజం మొత్తం బాధ్యత.
తీసుకోవాల్సిన చర్యలు
వలస పక్షుల సంరక్షణకు చెరువుల పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి వనరుల పునరుద్ధరణ వంటి చర్యలు అత్యవసరం. ముఖ్యమైన పక్షి ఆవాస ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించి, అక్కడ మానవ కార్యకలాపాలను నియంత్రించాలి. కాలుష్యాన్ని నియంత్రించడం, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం, గూళ్లు కట్టే లేదా ఆహారం తీసుకుంటున్న పక్షులకు ఆటంకం కలిగించకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని పక్షిప్రేమికులు కోరుతున్నారు.
అంతరించిపోతున్న పక్షిజాతులు
మధ్య ఆసియా వలస మార్గంలో ఆవాసాలు క్షీణించడం వల్ల పక్షులు ఆ ప్రాంతాన్ని విడిచిపెడుతున్నాయని చెప్పారు. కొన్ని జాతుల పక్షులు ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఆధ్వర్యంలో వలస పక్షులను పరిరక్షించడానికి, చిత్తడి నేలల శుభ్రతా కార్యక్రమాలు, పాఠశాలల్లో అవగాహన ప్రచారాలు పౌర - శాస్త్ర పక్షి గణనలు నిర్వహిస్తున్నామని రాజీవ్ ఖండేల్వాల్ తెలిపారు. పక్షుల దీర్ఘకాలిక పరిరక్షణకు, సరస్సుల రక్షణ, కాలుష్య నియంత్రణకు సమాజ భాగస్వామ్యం అవసరమని ఆయన వివరించారు.
