వట్ పల్లిస్టేషన్ పై దరఖాస్తుపల్లి గ్రామస్తుల దాడి.. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

వట్ పల్లిస్టేషన్ పై దరఖాస్తుపల్లి గ్రామస్తుల దాడి.. అనుమానాస్పద స్థితిలో  యువకుడి మృతి
  • పోలీసుల తీరుపై దరఖాస్తుపల్లి గ్రామస్తుల ఆగ్రహం
  • మృతుడి బంధువుపై చేయి చేసుకున్న ఎస్సై
  • పీఎస్​పై దాడి.. ఫర్నిచర్​ ధ్వంసం

సంగారెడ్డి/వట్ పల్లి, వెలుగు: అనుమానాస్పదంగా యువకడు చనిపోగా, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి పోలీస్ స్టేషన్  ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్ పల్లి మండలం ధరఖాస్తుపల్లికి చెందిన మేకల బీరప్ప(22) వట్ పల్లి సమీపంలోని ఓ దాబాలో కూలీగా పని చేస్తున్నాడు.

 శనివారం దాబా సమీపంలోని చెట్టుకు ఉరేసుకోగా, అనుమానాస్పదంగా బీరప్ప చనిపోవడంతో దాబా యజమానితో మృతుడి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి బీరప్ప సోదరుడు నాగరాజు సమక్షంలో డెడ్​బాడీని కిందికి దించారు. అంతలోనే గ్రామస్తులు అక్కడికి చేరుకొని డెడ్ బాడీని ఎందుకు దించారని నిలదీయడంతో గొడవ మొదలైంది. బీరప్ప మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని ఆందోళనకు దిగారు.

 ఈక్రమంలో మృతుడి పెద్ద నాన్నపై ఎస్సై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌పై దాడి చేశారు. స్టేషన్ లోని అద్దాలు, ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌ ను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, సీఐ అనిల్ కుమార్  అదనపు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

డీఎస్పీ మాట్లాడుతూ బీరప్ప మృతి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్టేషన్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసిన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీరప్ప అనుమానాస్పద మృతి, స్టేషన్‌‌‌‌‌‌‌‌పై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.