ప్రతివారం కొత్త తరహా కథలు, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ సినిమాలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. డిజిటల్ వీక్షకులు సైతం వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంటి వద్దే హాయిగా చూసేందుకు సరికొత్త ఇంట్రెస్టింగ్ సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు మరో ఇంట్రెస్టింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ మిస్టరీ థ్రిల్లర్, తమిళంలోతో పాటుగా తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రాబోతుండటం విశేషం. మరి ఆ సినిమా ఏంటనేది వివరాలు చూద్దాం...
‘వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి’:
2022లో విడుదలైన తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ ‘వదంతి’. ఇపుడు రెండో సీజన్ ‘వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి’ పేరుతో ఆడియన్స్ ముందుకు రానుంది. మలయాళ స్టార్ యాక్టర్ M.శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో అనఘ, అపర్ణ దాస్, యశ్వంత్ కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్గా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజై విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్విస్టులు, సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో సాగిన ఈ సిరీస్ ట్రైలర్.. థ్రిల్లర్ లవర్స్ కోసం డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు ‘విక్రమ్ వేద’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని అందించిన పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. తొలి సీజన్‌కు దర్శకత్వం వహించిన ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు కూడా రచయిత, దర్శకుడు, క్రియేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 'విక్రమ్ వేద' వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని అందించిన పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
‘వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి’ కేసులో శశికుమార్ దర్యాప్తు..
ట్రైలర్‌లో SI మూసా రాసా పాత్రలో శశికుమార్ కనిపించారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఒక అస్థిపంజరం బయటపడటంతో కేసు మొదలవుతుంది. ఈ దర్యాప్తు అతడిని మణి అనే ఖైదీ వద్దకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి కేసు ఊహించని మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టంగా మారుతుంది.
మదురై నగరం, అక్కడి ప్రసిద్ధ జల్లికట్టు ఉత్సవం నేపథ్యంగా సాగే ఈ సిరీస్‌లో క్రైమ్, రాజకీయాలు, మీడియా ఒత్తిళ్లు, మానవ సంబంధాలు కలిసి ఆసక్తికరమైన కథనాన్ని అందించనున్నాయి. ట్రైలర్‌లోని విజువల్స్, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వేగవంతమైన నేరేషన్ ప్రతి క్లూ దర్యాప్తు దిశను మార్చేలా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
మిస్టరీ ఇన్సిడెంట్స్, ట్విస్టులతో నిండిన ట్రైలర్
ట్రైలర్‌లో కథకు సంబంధించిన కీలక విషయాలను రివీల్ చేయకుండా, మిస్టరీని కొనసాగించేలా రూపొందించారు. మూసా రాసా దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ దాచిపెట్టిన రహస్యాలు, విభిన్న వాదనలు, నిజాన్ని బయటకు రానీయకుండా ప్రయత్నించే శక్తివంతమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తారు. ఈ సీజన్‌లో అపరాధ భావన (ఇతరులను బాధపెట్టామని భావించడం), రూమర్స్, సైలెన్స్, న్యాయం వంటి అంశాలను ప్రధానంగా చూపిస్తూ, "కనిపించే నిజమే అసలు నిజమా?" అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
‘వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి’ కథ ఇదే
ఈ సీజన్ కథ ఎస్‌ఐ మూసా రాజా చుట్టూ తిరుగుతుంది. ఒక హైప్రొఫైల్ రాజకీయ కోల్డ్ కేసును విజయవంతంగా ఛేదించిన తర్వాత, తన దర్యాప్తు వల్ల ఓ నిర్దోషి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడని అతనికి తెలుస్తుంది. తాను చేసిన తప్పును సరిదిద్దేందుకు, ప్రభుత్వ వ్యవస్థకు ఎదురొడ్డి, ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను వెలికితీసేందుకు మూసా రాజా మరోసారి దర్యాప్తు ప్రారంభిస్తాడు. శిక్షగా మదురై శివార్లకు బదిలీ అయినప్పటికీ, నిజాన్ని బయటకు తీసుకురావడానికి అతను చేసే పోరాటమే ఈ సీజన్ ప్రధాన కథాంశం. మిస్టరీ, సస్పెన్స్, భావోద్వేగాలతో కూడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేలా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు.
