జెన్ జెడ్ పని ఒత్తిడికి రిలాక్స్ ఇదే..ఏడవడానికి,కునుకు తీయడానికి ఆఫీస్ నుంచి కాసేపు బయటకు రండి..!

 జెన్ జెడ్ పని ఒత్తిడికి రిలాక్స్ ఇదే..ఏడవడానికి,కునుకు తీయడానికి ఆఫీస్ నుంచి కాసేపు బయటకు రండి..!

ప్రస్తుతం ఉద్యోగాల్లో చేరుతున్న జెన్​ జెడ్​ పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తాజాగా వచ్చిన ఒక రిపోర్ట్‌‌ చెప్తోంది. ఈ ఒత్తిడి కారణంగా కొందరు ఉద్యోగులు లంచ్ బ్రేక్‌‌ లేదా చిన్న విరామం దొరికినప్పుడల్లా ఆఫీస్‌‌ నుంచి బయటకు వెళ్లి కాసేపు నిద్రపోవడం, ప్రశాంతంగా కూర్చోవడం లేదా ఒంటరిగా ఏడ్చి మనసు తేలిక చేసుకోవడం వంటివి చేస్తున్నట్లు తేలింది. 

రిపోర్ట్‌‌ ప్రకారం, న్యూయార్క్‌‌లో పనిచేస్తున్న కొందరు యంగ్ ఎంప్లాయీస్​ తమ లంచ్ బ్రేక్‌‌ను భోజనం కోసం కాకుండా విశ్రాంతి కోసం ఉపయోగిస్తున్నారు. కొందరు సినిమా థియేటర్లలోకి వెళ్లి సీట్లలో కాసేపు నిద్రపోతున్నారు. మరికొందరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘న్యాప్‌‌ పాడ్స్‌‌’లో గంటసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకొందరు పార్కులు, లైబ్రరీలు, కేఫ్‌‌లు, షాపుల ఫిట్టింగ్‌‌ రూమ్‌‌లు లేదా ఎవరూ ఇబ్బంది పెట్టని నిశ్శబ్ద ప్రదేశాలకు వెళ్లి కాసేపు ఒంటరిగా గడుపుతున్నారు. ఇది ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేకపోవడం వల్ల కాదని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. 

రోజంతా మీటింగ్​లు, వరుస డెడ్‌‌లైన్‌‌లు, ఎక్కువ పనిభారం, ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై ఆందోళన వంటి కారణాలతో మానసికంగా బాగా అలసిపోతున్నారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొద్ది నిమిషాలైనా ప్రశాంతంగా గడపాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా కరోనా తర్వాత ఉద్యోగాల్లో చేరిన ఈ తరం చాలావరకు ఆన్‌‌లైన్‌‌లోనే చదువులు పూర్తి చేసి, వర్చువల్‌‌ వాతావరణంలో పనిచేయడం మొదలైంది. 

దీంతో ఆఫీస్‌‌ వాతావరణానికి అలవాటు పడటం, సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరో స్టడీలో తేలింది. కొందరు ఒంటరితనంవల్ల సెలవులు కూడా తీసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. అయితే కొంతమంది యాజమాన్య ప్రతినిధులు, పెద్దవాళ్లు ఈ పరిస్థితిని విమర్శిస్తున్నారు. 

పని సమయంలో బయటకు వెళ్లి నిద్రపోవడం లేదా ఏడవడం సరైన పద్ధతి కాదని, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అంటున్నారు. కానీ మానసిక ఆరోగ్య నిపుణులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. శరీరం, మనసు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం సహజమైన ప్రతిస్పందన అని, దీనిని సోమరితనంగా చూడకూడదని వాళ్లు సూచిస్తున్నారు. 

మొత్తానికి, ఈ రిపోర్ట్‌‌ ఒక కొత్త ఉద్యోగ సంస్కృతిని చూపిస్తోంది. జెన్​ జెడ్ ఉద్యోగులు పని కంటే విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కాదు.. ఒత్తిడి ఎక్కువైతే దాన్ని దాచిపెట్టకుండా, తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చిన్న చిన్న విరామాలు తీసుకుంటున్నారని ఇది సూచిస్తోంది. అదే సమయంలో, ఉద్యోగులు బర్నౌట్‌‌కు గురికాకుండా ఉండేందుకు కంపెనీలు కూడా మెరుగైన పని వాతావరణం, సరైన విరామాలు, మానసిక ఆరోగ్యానికి తోడ్పడే విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎక్స్​పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.