కొందరు నటీమణులు అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరికొందరు తమ నటనతో మనసుల్లో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఖుషీ రవి (Khushi Ravi) ఒకరు. కన్నడలో తెరకెక్కిన దియా సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఖుషీ.. ఆ తర్వాత పిండం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఖుషీ రవి జర్నీలోని ఇంట్రెస్టింగ్ విశేషాలివి.
ఖుషీ రవి అసలు పేరు సుస్మిత రవి. బెంగళూరులోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ కనబరిచింది. కుటుంబం కూడా చదువుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో బయోటెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించింది. బెంగళూరులోని ఎస్.ఎస్.ఎం.ఆర్.వి కాలేజీలో బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొంతకాలం ల్యాబ్‌లో ఉద్యోగం కూడా చేసింది.
అయితే కాలేజీ రోజుల్లో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆమె ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. స్టేజ్‌పై నటించడం ద్వారా కలిగిన అనుభూతి ఆమెను నటన వైపు ఆకర్షించింది. దీంతో ఉద్యోగం కంటే తన మనసుకు నచ్చిన రంగంలోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ప్రొఫెషనల్ థియేటర్ గ్రూపుల్లో చేరి నటనలో శిక్షణ తీసుకుంది. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, పాత్రలో ఒదిగిపోవడం వంటి అంశాల్లో థియేటర్ ఆమెకు బలమైన పునాదిని అందించింది. అదే అనుభవం తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకోవడానికి ఉపయోగపడింది.
గుర్తింపు కోసం సాగిన నిరీక్షణ..
2016లో ది గ్రేట్ స్టోరీ ఆఫ్ సోడాబుడ్డి చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ, ఆ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం, వరుసగా ఆడిషన్లు ఇవ్వడం ఆమె డైలీ రొటీన్‌గా మారింది. ఎన్నో సందర్భాల్లో చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోయాయి. తనతో చదివిన స్నేహితులు ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే, తాను మాత్రం నటిగా అవకాశాల కోసం ఎదురుచూడాల్సి రావడం ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయినప్పటికీ నటనపై ఉన్న ప్రేమతో వెనక్కి తగ్గలేదు. ప్రతి ఆడిషన్‌ను ఒక కొత్త అవకాశంగా భావిస్తూ ముందుకు సాగింది.
‘దియా’తో మారిన కెరీర్..
ఖుషీ.. జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా దియా. దర్శకుడు కె.ఎస్. అశోక్ తెరకెక్కించిన ఈ చిత్రం 2020లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఖుషీ రవి నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కళ్లతోనే భావాలను వ్యక్తపరిచిన ఆమె నటన ప్రేక్షకులను కదిలించింది. తర్వాత ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ అయి ఓటీటీలో మంచి ఆదరణ పొందడంతో ఆమె పేరు దక్షిణాది సినీ పరిశ్రమలో మారుమోగింది.
సాధారణ జీవనశైలే ఇష్టం..
వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో సాధారణంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. అనవసర ప్రచారం, గ్లామర్ పార్టీలకు దూరంగా ఉంటూ కుటుంబంతో సమయం గడపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. పుస్తకాలు చదవడం, ప్రకృతి మధ్య విహరించడం, యోగా చేయడం ఆమెకు ఇష్టమైన పనులు. ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ కెరీర్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా కథానాయికగా వరుస అవకాశాలు అందుకోవడం ద్వారా వివాహం తర్వాత హీరోయిన్‌లకు అవకాశాలు తగ్గిపోతాయనే అభిప్రాయాన్ని కూడా మార్చేసింది.
సైన్స్ ల్యాబ్‌లో ప్రారంభమైన ఆమె ప్రయాణం నేడు వెండితెరపై ప్రశంసలు అందుకునే స్థాయికి చేరుకుంది. అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులు, తిరస్కరణలు, నిరాశలు, ఆత్మవిశ్వాసంతో అధిగమించిన కష్టాలు.. ఇవన్నీ ఖుషీ రవి ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి పాత్రలో కొత్తదనాన్ని చూపించాలనే తపనతో ముందుకు సాగుతున్న ఖుషీ రవి.. నేటి తరం సహజ నటీమణుల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది.
టాలీవుడ్‌లో..
దియా విజయంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. 2023లో విడుదలైన పిండం చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గర్భిణి మహిళ ‘మేరీ’ పాత్రలో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు భాష తెలియకపోయినా డైలాగులు నేర్చుకుని పాత్రకు తగ్గట్టుగా నటించిన తీరు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత స్పూకీ కాలేజ్, కేస్ ఆఫ్ కొండాన, ఫుల్ మీల్స్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే జీ5 ఒరిజినల్ సిరీస్ ‘అయ్యన మనే’ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించింది. సినిమా, వెబ్‌సిరీస్ అనే తేడా లేకుండా కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవడం ఆమె ప్రత్యేకత.
పాత్రకోసం చేసే హోంవర్క్..
ఖుషీ రవిని ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె పాత్రల పట్ల చూపే అంకితభావం. ప్రతి పాత్ర కోసం ముందుగానే విస్తృతంగా సిద్ధమవుతుంది. దర్శకుడు ఆశించిన పాత్రను సహజంగా తెరపై చూపించేందుకు ప్రత్యేకంగా స్టడీ చేస్తుంది. ‘అయ్యన మనే’ సిరీస్‌లో1990ల నాటి గ్రామీణ మహిళ పాత్ర కోసం అప్పటి సినిమాలను పరిశీలించింది. అంతేకాదు, తన తల్లి, అమ్మమ్మల హావభావాలు, నడక, మాట్లాడే తీరు గమనించి వాటిని పాత్రలో మేళవించింది. పాత్ర చిన్నదా, పెద్దదా అనేది కాకుండా కథలో దాని ప్రాధాన్యమే ముఖ్యమని నమ్ముతుంది.
స్ట్రగుల్స్
తెరపై కనిపించే చిరునవ్వుల వెనుక ఖుషీ రవి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. దియా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక కారణాలతో సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ సమయంలో తిరిగి బయోటెక్నాలజీ ఉద్యోగంలో చేరిపోవాలనే ఆలోచన కూడా చేసింది. అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యం ఆమెను ఆ నిర్ణయం నుంచి వెనక్కి తీసుకొచ్చింది. సినిమా విడుదలైన తర్వాత వచ్చిన విజయం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన గుర్తింపు ఒక్కసారిగా దక్కినా.. ఆ విజయానికి వెనుక ఉన్న కష్టం మాత్రం చాలా పెద్దది.
